విలేకర్లు నైతిక విలువలతోపనిచేస్తే తగిన గుర్తింపు -మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డివిజయవంతంగా ముగిసిన సీఆర్ మీడియా అకాడమి, ఏపీయూడబ్ల్యుజే గ్రామీణ విలేకరుల పునశ్చరణ తరగతులు

విలేకర్లు నైతిక విలువలతో పనిచేస్తేనే తగిన
గుర్తింపు వస్తుందని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. స్థానిక. మార్కాపురం ప్రెస్ క్లబ్ లో సీఆర్ మీడియా అకాడమి, ఆంధ్రప్రదేశ్, ఏపీయూడబ్ల్యుజే సంయుక్త అధ్వర్యంలో జిల్లాలోని గ్రామీణ విలేకరులకు జరుగుతున్న పునశ్చరణ తరగతులు ముగిసాయి. ఆదివారం సాయంత్రం జరిగిన ముగింపు సభకు ముఖ్య అతిధిగా హాజరైన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ…. సమాజంలోని సమస్యల పరిష్కారానికి మీడియా చొరవ ఎంతో అవసరం అన్నారు. ఖచ్చితత్వంతో కూడిన కథనాలను ప్రచురించడం ద్వారా మీడియా సంస్థలకు విశ్వసనీయత పెరుగుతుందన్నారు. నేటి అధునిక సమాజం సోషల్, వెబ్ మీడియాల ప్రభావానికి లోనవుతోందన్నారు. కొన్ని మీడియాలు సంచలనాల కోసం అత్యుత్సాహంతో కట్టు తప్పుతున్నాయన్నారు . ఆయా సంస్థల వలన వ్యక్తులకు, సమూహాలకు ఎన్న నష్టాలు కలిగే ప్రమాదం ఉందన్నారు. కొందరి స్వార్థం కోసం అందరినీ బలి చేయడం మంచి పద్ధతి కాదన్నారు. గతంలో తాను కూడా కొన్ని మీడియాల వలన తీవ్రంగా ఇబ్బందిపడ్డానన్నారు. సమాజాన్ని మంచి మార్గంలో నడిపే వాళ్లు ప్రజల్ని తప్పుదోవ పట్టించడం ఎంత వరకు సబబు అని అన్నారు. కూటమి ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. గత ప్రభుత్యాలు జర్నలిస్టులను అరెస్టు చేయడం, దాడులు చేయడంలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డాయన్నారు. కానీ కూటమి ప్రభుత్వం జర్నలిస్టుల వృత్తి నైపుణ్యాలను పెంపొందించేందుకు ఇలాంటి మంచి శిక్షణా తరగతులు నిర్వహిస్తోందన్నారు. గ్రామీణ ప్రాంత విలేకరులు ఎన్నో ఇబ్బందుల నడుమ వృత్తి జీవనాన్ని సాగిస్తున్నారన్నారు. తన పరిధిలో విలేకరుల సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా ముందుంటానని అన్నారు. ఇప్పటికే తాను ఒకమారు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇప్పించానని అన్నారు. ఇంకా ఎవరైనా ఇంటి స్థలాలు పొందని అర్హులైన జర్నలిస్టులు ఉంటే తాను తప్పక వారికి న్యాయం చేస్తానన్నారు. మార్కాపురం డీఎస్పీ డాక్టర్ యు. నాగరాజు మాట్లాడుతూ ఒకనాటి జర్నలిజానికి, నేటి జర్నలిజానికి చాలా వ్యత్యాసం ఉందన్నారు. ఒకప్పుడు ఎలాంటి సదుపాయాలు, సాంకేతికత అందుబాటులో లేకపోయినా విలేకరులు ఎంతో కష్టపడి ఖచ్చితమైన సమాచారంతో మంచి కథనాలు అందించే వాళ్లన్నారు. కానీ నేడు నాణ్యతతో కూడా కథనాలు తగ్గిపోయాయన్నారు. ప్రస్తుతం ఎన్నో ఆధునిక సాంకేతిక పద్ధతులు అందుబాటులోకి వచ్చినా నాణ్యత మాత్రం పెరగడంలేదన్నారు. తాను కేవలం పత్రికలు చదవడం ద్వారా విజ్ఞానాన్ని సముపార్జించుకుని ఉన్నత స్థానానికి ఎదగగలిగానని అన్నారు. ప్రస్తుతం భాషపై పట్టు ఎంతో అవసరం అన్నారు. తెలుగు బాష ఎంతో సరళవంతమైనదో తప్పులు దొర్లితే అంతే క్లిష్టంగా మారుతుందన్నారు. విలేకరులు ఇలాంటి శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం ద్వారానే ఏ రంగంలోనైనా పురోగతి సాదించగలం అన్నారు. సీఆర్ మీడియా అకాడమి చైర్మన్ అలపాటి సురేష్ కుమార్ మాట్లాడుతూ…. శిక్షణా తరగతులకు హాజరవ్వడానికే పరిమితం కాకుండా రేపటి నుంచి నేర్చుకున్న అంశాలను క్షేత్రంలో అమలు పర్చాలన్నారు. విలువలతో కూడిన జర్నలిజానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. జర్నలిస్టులు ఎవరి హక్కులకు భంగం కలిగించకుండా సమాజాన్ని మంచి మార్గంలో నడపడంలో కీలకపాత్ర పోషించాలన్నారు. ఏపీయూడబ్యుజే రాష్ట్ర అధ్యక్షులు ఐవీ సుబ్బారావు మాట్లాడుతూ …..కష్టపడే తత్వం ఉంటే ఎవరైనా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చన్నారు. జర్నలిస్టులు నిత్య విద్యార్థులన్నారు. నిరంతరం సమాచార సముపార్జనకు కృషి చేస్తేనే మంచి కథనాలు వెలువడుతాయన్నారు. మనసుపెట్టి పనిచేస్తే సమాజంలోని ఎన్నో రుగ్మతలను రూపుమాపే శక్తి జర్నలిజానికి ఉందన్నారు. ప్రభుత్వాలు, ప్రజలకు వారదిగా భాధ్యతాయుతంగా పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకోవాలన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నాలుగు అంశాలపై విలేకరులకు శిక్షణ ఇచ్చారు. కృత్రిమ మేధపై సీనియర్ జర్నలిస్టు విజయ్ కుమార్ విలేకరుల నుంచి డెస్క్ ఏం కోరుకుంటోంది అనే అంశంపై నెల్లూరు ఆంధ్రజ్యోతి ఎడిషన్ ఇన్చార్జి రామకృష్ణ పత్రికా బాషా మెళకువలపై ఆంధ్రజ్యోతి సెంట్రల్ డెస్క్ విభాగం సీనియర్ జర్నలిస్టు సతీష్, ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టింగ్ పై మెళకువలు అంశంపై 10 టీవీ బ్యూరో చీఫ్ కె జయరాజు శిక్షణ ఇచ్చారు. అనంతరం ముగింపు సభలో శిక్షణలో పాల్గొన్న విలేకరులకు సర్టిఫికేట్లు, వివిధ అంశాపై ఆకాడమీ ప్రచురించిన పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యుజే రాష్ట్ర కార్యదర్శి అలుగుల సురేష్ ,యూనియన్ ఎలక్ట్రానిక్ మీడియా విభాగం రాష్ట్ర అధ్యక్షులు వి.శివ, అకాడమీ కార్యదర్శి మణి రాము, ఏఎమ్. సి చైర్మన్ మాలపాటి వెంకటరెడ్డి, ఏ1 గ్లోబల్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ మీర్జా షంషీర్ అలిబేగ్, . యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎన్. వి రమణ, జిల్లా సహాయ కార్యదర్శి బంకా శ్రీనివాసరావు, డి. కనకయ్య, వార్త బ్రాంచ్ మేనేజర్ మూల అల్లూరిరెడ్డి, మార్కాపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు డి.మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *