పారిశుధ్యము, ముఖ్యంగా తడి – పొడి చెత్త నిర్వహణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ పీ.రాజాబాబు
స్పష్టం చేశారు. పంచాయతీ, అనుబంధ శాఖల అధికారులతో మంగళవారం ఆయన ప్రకాశం భవనంలో ప్రత్యేకంగా సమీక్షించారు. పంచాయతీల ఆదాయ వనరులు, పారిశుద్ధ్యము, తాగునీరు, వీధిలైట్లు, రోడ్లు, డ్రైనేజీల నిర్వహణపై శాఖల వారీగా ఆరా తీశారు. చట్ట ప్రకారం నిర్వహించాల్సిన విధులతో పాటు జిల్లాలోని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా మరింత శ్రద్ధ పెట్టాల్సిన అంశాలను ఆయన అడిగితెలుసుకున్నారు. ఆయా వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు వివరించారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ
పారిశుధ్య నిర్వహణలో భాగంగా తడి చెత్తను, పొడి చెత్తను ఇంటిలోనే వేరు చేసేలా ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్లాస్టిక్ వ్యర్ధాలను వేసేలా వీధి చివర్లో ప్రత్యేక డబ్బాలు పెట్టాలని ఆదేశించారు. ఒక గ్రామాన్ని పైలెట్ గా తీసుకుని అమలు చేయాలని చెప్పారు. తడి, పొడి చెత్తను ఎస్.డబ్ల్యూ.పీ. షెడ్లకు తరలించాలని, ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించేందుకు గ్రామ స్థాయిలో ఒక కలెక్షన్ సెంటర్ పైలెట్ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
పశుగ్రాసం సాగు చేసే ఐదు ఎకరాల లోపు పొలం ఉన్న చిన్న, సన్నకారు రైతులకు డ్వామా ఆధ్వర్యంలో అర ఎకరాకు రూ.32 వేల ఆర్థిక సాయం చేస్తున్నట్లు సంబంధిత శాఖల అధికారులు చెప్పగా, దీని ఆధారంగా జిల్లాలో పశుగ్రాస బ్యాంకులు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. సాగుదారుల నుంచి సేకరించిన ఈ గ్రాసాన్ని అవసరమైన పశుపోషకులు ఎవరైనా కొనుగోలు చేసుకోవచ్చని చెప్పారు. పశుగ్రాస బ్యాంకు – వినియోగదారులను అనుసంధానం చేసేలా ప్రత్యేక యాప్ తయారు చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న
మనమిత్ర వాట్సప్ సర్వీస్ లపై విస్తృత ప్రచారం కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో డిపిఓ వెంకటేశ్వరరావు, జడ్పీ సీఈఓ చిరంజీవి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్.ఈ. బాల శంకరరావు, పంచాయతీరాజ్ ఎస్.ఈ. అశోక్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
