అడవుల సంరక్షణతో పాటు పర్యాటక అభివృద్ధి పైనా దృష్టి సారించాలి – జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు

  అడవుల సంరక్షణతో పాటు పర్యాటక అభివృద్ధి పైనా దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు చెప్పారు. ఇందుకు అవసరమైన ఆర్థిక సహకారాన్ని జిల్లా యంత్రాంగం తరఫు నుంచీ అందిస్తామన్నారు. వివిధ విభాగాల అటవీ శాఖ అధికారులతో మంగళవారం ఆయన ప్రకాశం భవన్లో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. 
        జిల్లాలో అటవీ ప్రాంత విస్తీర్ణం, నగరవనాల అభివృద్ధి, రోడ్లు, మొబైల్ టవర్ల నిర్మాణాలు వంటి భారీ ప్రాజెక్టులకు అటవీశాఖ అనుమతులు, కోస్తా తీరం వెంట గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ అభివృద్ధి, రెవెన్యూ రికార్డులలో రిజర్వ్ ఫారెస్ట్ భూముల వివరాలు అప్ డేషన్ / మ్యూటేషన్ , ఫారెస్ట్, వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్, అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలు, పర్యాటక అభివృద్ధి, స్థానికులకు జీవనోపాధి కల్పించేందుకు తీసుకుంటున్న చర్యలు, తదితర అంశాలపై సంబంధిత అధికారులు కలెక్టరుకు వివరించారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారానికి అటవీ శాఖల వివిధ విభాగాల నుంచి ఒకరిని ప్రత్యేకంగా కేటాయించాలని చెప్పారు. దీనితోపాటుగా ప్రతినెలా అటవీ భూముల పరిరక్షణకు అవసరమైన సంయుక్త సమావేశం, భూముల జాయింట్ సర్వే జరిగేలా చర్యలు తీసుకుంటానని ఆయన తెలిపారు. జిల్లాలో రెండు విమానాశ్రయాలు రానున్నాయని, వచ్చే ఏడాది ఆగస్టు నాటికి వెలుగొండ ద్వారా నీళ్లు ఇవ్వాలన్నది ముఖ్యమంత్రి ఆలోచన అని కలెక్టర్ చెప్పారు. ఇవి అందుబాటులోకి వస్తే ప్రకాశం జిల్లా ముఖచిత్రమే మారిపోతుందన్నారు. హైదరాబాద్,  అమరావతి, తిరుపతి, బెంగళూరులకు మధ్యలో ఉన్న ప్రాంతం కావటం, నల్లమల పరిధిలో ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఉండడం వలన భవిష్యత్తులో మంచి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేలా అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని అటవీశాఖ అధికారులకు సూచించారు. 

            ఈ సమావేశంలో జిల్లా అటవీ శాఖ అధికారి వినోద్ కుమార్, డీ.ఎఫ్.వో. ( సోషల్ ఫారెస్ట్ ) రాజశేఖర్ రావు, గిద్దలూరు టైగర్ రిజర్వ్ డీ.డీ. నిషా కుమారి, మార్కాపురం అటవీశాఖ డిప్యూటీ డైరెక్టర్ షేక్ మహమ్మద్ అబ్దుల్ రవుఫ్, జిల్లా పర్యాటక అధికారి శ్రీరమ్య ( ఇంచార్జి), ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *