మొంథా తుఫాను ప్రభావాన్ని ప్రజలు తేలికగా తీసుకోకూడదని ,ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వం అవసరమైన ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు.
మొంథా తుఫాను నేపధ్యంలో మంగళవారం ఉదయం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా డోలా బాల వీరాంజనేయ స్వామి, జిల్లా ప్రత్యేక అధికారి కోన శశిధర్ తో కలసి సింగరాయకొండ మండలంలోని తీర ప్రాంత మత్స్యకార గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ప్రజలను అప్రమత్తం చేస్తూ తుఫాన్ పరిస్థితులపై అధికారులతో సమీక్షించారు. తొలుత ఊళ్ళపాలెం పల్లెపాలెంను సందర్శించి జోరు వానలో గ్రామస్థులతో మాట్లాడుతూ, ఇళ్ళ కు వెళ్లి తుఫాన్ నేపధ్యంలో వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ వారిని అప్రమత్తం చేయడం జరిగింది. ఆందోళన చెందవద్దని, అధైర్య పడొద్దని, ప్రభుత్వం అండగా ఉందని మంత్రి ఈ సందర్భంగా గ్రామస్తుల్లో భరోసా కల్పించారు. అనంతరం పాకల చెల్లెమ్మగారిపాలెం లో ఏర్పాటుచేసిన తుఫాన్ పునరావాస కేంద్రాన్ని సందర్శించి కల్పిస్తున్న వసతులు, సౌకర్యాల పై తుఫాన్ బాధితులతో మాట్లాడటం జరిగింది. ప్రభుత్వం అన్నీ ముందస్తు చర్యలు తీసుకోవడం జరుగుచున్నదని, మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వెళ్లరాదని, అధికారులకు సహకరిస్తూ తుఫాన్ ప్రభావం తగ్గేవరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో సురక్షితంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేసారు. అనంతరం పాకల బీచ్ ను సందర్శించి అక్కడి పరిస్థితిని పరిశీలించి, అధికారుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి డా. డోలా బాల వీరాంజనేయ స్వామి మీడియాతో మాట్లాడుతూ, మొంథా తుఫాను ప్రభావం ప్రజలపై పడరాదన్న ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తుందన్నారు. అధికార యంత్రాంగం చేపడుతున్న తుఫాన్ ముందస్తు ఏర్పాట్లుపై ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు వీడియో , టెలి కాన్ఫెరెన్స్ ల ద్వారా సమీక్షిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఎక్కడా ఆస్తి, ప్రాణ నష్టం జరగరాదని జిల్లా యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. పాకల చెల్లెమ్మగారిపాలెం లో ఏర్పాటుచేసిన తుఫాన్ పునరావాస కేంద్రాన్ని సందర్శించడం జరిగిందని, ఈ పునరావాస కేంద్రంలో ఉన్నవారు అధికారులు చేస్తున్న సహాయక చర్యలపై సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారన్నారు. జిల్లా యంత్రాంగం పూర్తిగా రక్షణ చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఎక్కడైనా ప్రజలకు ఇబ్బంది కలిగితే వెంటనే వాటిని సరిదిద్దేలా చర్యలు తీసుకోవడం జరుగుచున్నదన్నారు. తుఫాన్ నేపధ్యంలో అవసరమైతే తప్పనిచ్చి ప్రజలు బయటకు రావద్దని మంత్రి ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేసారు. అన్నీ గ్రామాల్లో మెడికల్ టీం లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గర్భవతులకు , వయస్సు పైబడిన వారికి ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే వారిని వెంటనే వైద్యశాలకు తరలించేలా ఏర్పాట్లు కూడా చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. తుఫాన్ సహాయక చర్యల్లో ప్రజలు కూడా తమవంతు సహకారం అందించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసారు.
జిల్లా ప్రత్యేక అధికారి కోన శశిధర్ మీడియాతో మాట్లాడుతూ మొంథా తుఫాను సందర్భంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ప్రకాశం జిల్లా ప్రత్యేక అధికారిగా జిల్లాలో తుఫాన్ పరిస్థితులను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగానికి సపోర్ట్ గా ఇక్కడికి రావడం జరిగిందన్నారు. ఈ రోజు మంత్రి గారితో కలసి పలు గ్రామాల్లో పర్యటించి ఇక్కడి పరిస్థితులను తెలుసుకోవడం జరుగుచున్నదన్నారు. ప్రభుత్వం తీరప్రాంతా గ్రామాల్లోని మత్స్యకారులను సముద్రంలోకి వేటకు వెల్లకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉంచడం జరిగిందన్నారు. తుఫాన్ నేపధ్యంలో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాల్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా వారికి భోజనం, తాగునీరు సక్రమంగా అందుతున్నాయా లేదా, మెడికల్ క్యాంపు లు ఏర్పాటు చేసారా లేదా అలాగే గ్రామాల్లో వర్షం నీరు నిలిచిందా లేదా పరిశీలించడం, నీరు నిలిచి వుంటే ఆ నీటిని తొలగించడం వంటి కార్యక్రమాలు పటిష్టంగా జరుగుచున్నవా లేదా పరిశీలించడం జరుగుచున్నదన్నారు. ఈ రోజు రాత్రికి మొంథా తుఫాను తీరం దాటే అవకాసం ఉన్నందున ఈ లోపు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండి, తుఫాన్ అనంతరం ఎక్కడెక్కడ నష్టం జరిగింది, పునరావాస కేంద్రానికి తరలించిన ప్రజలను తిరిగి వారి ఇంటికి సురక్షితంగా తరలించడం వంటి ఏర్పాట్లు పై ఎప్పటికప్పుడు సమీక్షించడం జరుగుతుందన్నారు. ప్రస్తుతానికి తుఫాన్ సహాయక చర్యలు జిల్లా యంత్రాంగం పటిష్టంగా చేపట్టడం జరిగిందన్నారు. ప్రజలతో కూడా మాట్లాడటం జరుగుచున్నదని, వారు కూడా ఎటువంటి ఇబ్బందులు లేవని తెలిపడం జరుగుచున్నదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి , మంత్రి ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్నారని, వారి సూచనలు పాటిస్తూ తుఫాన్ సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తెసుకుంటున్నట్లు తెలిపారు.
మంత్రి వెంట ఆర్ డి ఓ లక్ష్మీ ప్రసన్న, మండల ప్రత్యేక అధికారి జిల్లా పరిషత్ సిఈఓ చిరంజీవి, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.



