తాళ్లూరు మండలంలోని బొద్దికూరపాడు-శంకరనా
రాయణపురం రోడ్డు అధ్వానంగా ఉంది. బొద్దికూరపాడు గ్రామ ప్రజలకు ఈమార్గంలో దాదాపు రెండువేల ఎకరాల భూములు ఉన్నాయి. 500 మంది రైతులు ప్రతినిత్యం వ్యవసాయ పనుల నిమిత్తం ఈరోడ్డు గుండా రాకపోకలు సాగిస్తుంటారు. రోడ్డు పక్కనే మాగాణి పొలాలు ఉండటంతో నీటి ఊటలతో ఈరోడ్డు మాగాణిని తలపిస్తున్నది. రోడ్డుకు ఇరువైపులా ముళ్ల కంప, పిచ్చి మొక్కలు అల్లుకుని ఉన్నాయి. పొలాలకు ట్రాక్టర్ల రాకపోకలు సాగిస్తుండటంతో రోడ్డు గుంతలమయంగా మారింది.
రోడ్డు బంక మట్టితో ఉండటంతో ద్విచక్రవాహనదారులు జారిపడుతూ గాయాలపాలవుతున్నారు. పశువులకు గడ్డి మేత తెచ్చుకునేందుకు ఈరోడ్డు గుండా వెళ్లాలంటే ప్రాణాంతకంగా ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు ఈరోడ్డు దారుణంగా తయారైంది. అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేసి తమ ఇబ్బందులను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.

