సంక్రాంతి పండుగ దృష్ట్యా శనివారం నుంచి సంక్షేమ హాస్టళ్లకు ప్రభుత్వం సెలవులు ప్రకటించడంతో విద్యార్థులందరూ ఇంటికి వెళ్లేందుకు
సిద్ధమయ్యారు. శుక్రవారం సాయంత్రం నుంచే వెళ్లేందుకు సిద్ధపడిన విద్యార్థుల పట్ల దొనకొండలోని బాలుర సాంఘిక సంక్షేమ హాస్టల్ -1 వార్డెన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు పడకూడదన్న ఆలోచనతో శుక్రవారం హాస్టల్ లోనే బస చేసి, శనివారం ఉదయం టిఫిన్ తిని వెళ్లాలని విద్యార్థులకు సూచించారు. జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఎన్. లక్ష్మా నాయక్ శుక్రవారం రాత్రి ఈ హాస్టల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సమయంలో విద్యార్థులు ఈ విషయాన్ని ఆయన దృష్టికి తెచ్చారు. విద్యార్థుల భద్రత, ప్రయాణ సౌకర్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపిన హాస్టల్ వార్డెన్ జి. మంత్రు నాయక్ ను లక్ష్మానాయక్ అభినందించారు. హాస్టల్ లోని సౌకర్యాలు, విద్యా ప్రమాణాలు మరియు పారిశుధ్యాన్ని ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. వంటగది, స్టోర్ రూమ్, తాగునీటి వసతులను తనిఖీ చేశారు. విద్యార్థులకు వడ్డిస్తున్న భోజనం , చికెన్ , భగారా రైస్ ను ఆయన స్వయంగా విద్యార్థులతో కలిసి తిని రుచి చూసి, ఆహార నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ హాస్టల్ లో పూర్తిస్థాయిలో 200 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులతో లక్ష్మానాయక్ ప్రత్యేకంగా మాట్లాడారు. 10వ తరగతి విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం రూపొందించిన ‘100 రోజుల ప్రత్యేక ప్రణాళిక’ను పక్కాగా అమలు చేయాలని సిబ్బందికి ఆయన స్పష్టం చేశారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. వసతి గృహాల్లో ప్రతిరోజూ ‘ముస్తాబు’ (పరిశుభ్రత) కార్యక్రమం నిర్వహించాలని, విద్యార్థులకు కాచి వడపోసిన మంచినీటినే అందించాలని ఆదేశించారు.



