ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే రెవెన్యూ వ్యవస్థలో ప్రభుత్వం సంస్కరణలు తీసుకు వస్తున్నదని జిల్లా కలెక్టర్ శ్
పి.రాజాబాబు
చెప్పారు. క్షేత్రస్థాయి సేవల్లోనూ ఈ దిశగా స్పష్టమైన మార్పు కనిపించాలని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం ఒంగోలులోని కలెక్టరేట్లో నిర్వహించిన ప్రకాశం, మార్కాపురం జిల్లాల రెవెన్యూ అధికారుల కాన్ఫరెన్స్ లో ఆయన పాల్గొని రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు సంబంధిత అంశాలపై జాయింట్ కలెక్టర్ శ్రీ.ఆర్. గోపాలకృష్ణతో కలిసి అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాయింట్ కలెక్టర్ వద్ద ఉన్న అధికారాలను డిఆర్ఓలకు, డివిజన్ లెవెల్ ఆఫీసర్ల వద్ద ఉన్న అధికారాలను తహసిల్దార్లకు ప్రభుత్వం బదలాయించిందన్నారు. ప్రజా ప్రయోజన కోసం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయ ఫలాలు క్షేత్రస్థాయిలో ప్రస్ఫుటంగా, నిష్పక్షపాతంగా కనిపించాలన్నారు. భూముల మ్యుటేషన్, ఆన్ లైన్, సర్వే వంటి విషయాల్లో ప్రతి మండల పనితీరును ఇకపై క్షుణ్ణంగా సమీక్షిస్తానని కలెక్టర్ తెలిపారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంతో పాటు ప్రభుత్వ భూములను కాపాడే బాధ్యత రెవెన్యూ అధికారులపై ఉందన్నారు. సమస్యల పరిష్కారానికి రెవెన్యూ క్లినిక్లను సమర్ధంగా వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. ఇకపై ప్రతినెలా రెవెన్యూ కాన్ఫరెన్స్ నిర్వహిస్తానని తెలిపారు. ఫైళ్ళు అన్నీ ఆన్లైన్ లోనే తనకు పంపించాలన్నారు. తహసిల్దార్లు అందరూ టూర్ డైరీ రిపోర్టులు తనకు పంపించాలని కలెక్టర్ ఆదేశించారు. విస్తృతంగా ప్రజల్లో ఉండి సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని వారికి దిశానిర్దేశం చేశారు. మండల స్థాయి అధికారుల పనితీరును డివిజన్ స్థాయిలో ఆర్డీవోలు, సబ్ కలెక్టర్ నిరంతరం
గమనిస్తూ ఉండాలని కలెక్టర్ చెప్పారు. 22(ఏ) భూముల జాబితాలో చేర్పులు, తొలగింపుల కోసం ప్రభుత్వం నిర్దేశించిన నియమాలను కచ్చితంగా పాటించాలన్నారు. సబ్ డివిజన్ చేయటం, రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో పాటించాల్సిన ప్రక్రియపైనా
ఈ కార్యక్రమంలో అధికారులకు అవగాహన కల్పించారు. ఈనెల 11వ తేదీలోపు పట్టాదారు పాస్ పుస్తకాలన్నీ పూర్తిస్థాయిలో పంపిణీ చేయాలని అధికారులకు కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ కాన్ఫరెన్స్లో డిఆర్ఓ బి.చినఓబులేసు, కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశీ, ఒంగోలు, అద్దంకి ఆర్డిఓ లక్ష్మీ ప్రసన్న, కనిగిరి ఆర్డీవో కేశవర్ధన్ రెడ్డి, మార్కాపురం ఇన్చార్జి సబ్ కలెక్టర్ శివరామిరెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా రిజిస్ట్రార్ బాలాంజనేయులు, సర్వే శాఖ సహాయ సంచాలకులు గౌస్ బాషా, దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ పానకాలరావు, సబ్ రిజిస్ట్రారులు, తహసిల్దార్లు, డిప్యూటీ తహసిల్దారులు, మండల సర్వేయర్లు, దేవదాయ శాఖ ఈవోలు పాల్గొన్నారు.
అనంతరం మార్కాపురం జిల్లాకు ఇన్చార్జిలుగా ఉన్న కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డిఆర్ఓ లతోపాటు అద్దంకి ఇంచార్జ్ ఆర్డిఓ లక్ష్మీ ప్రసన్న, కందుకూరు ఇంచార్జ్ సబ్ కలెక్టర్ నాగిరెడ్డి, మార్కాపురం ఇన్చార్జి సబ్ కలెక్టర్ శివరామిరెడ్డి, కనిగిరి ఆర్డీవో కేశవర్ధన్ రెడ్డిలను ఈ సందర్భంగా ఏపీ రెవిన్యూ సర్వీసుల అసోసియేషన్ ప్రతినిధులు
సత్కరించారు.

