జిల్లా ప్రజల నుండి వచ్చే వివిధ రకాల ఫిర్యాదులకు త్వరితగతిన పరిష్కారం కల్పించాలనే ఉద్దేశంతో సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ పోలీస్ అధికారులతో కలిసి ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం (మీకోసం)’ నిర్వహించారు.
ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదిదారుల యొక్క వ్రాతపూర్వక ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించి వారితో ముఖాముఖిగా మాట్లాడి వారి ఫిర్యాదుల సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని చట్టపరిధిలో పరిష్కరిస్తామని వారికి భరోసా కల్పించారు.
అందిన ఆయా ఫిర్యాదులపై ఎస్పీ సంబందిత పోలీస్ స్టేషన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి ఆ ఫిర్యాదులపై తక్షణ విచారణ చేపట్టి, చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోని భాధితులకు న్యాయం అందించాలని, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఫిర్యాదులపై అలసత్వం వహించకుండా నిర్ణీత గడువులో ఫిర్యాదులు పరిష్కారించాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు.
ఫిర్యాదు చేయడానికి వచ్చే వృద్ధులు, నడవలేని పరిస్థితిలో ఉన్న వారి సమస్యలను ప్రత్యేకంగా పరిశీలనలోకి తీసుకొని, చట్టప్రకారం సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు జిల్లా ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా సివిల్, భూ, ఆర్థిక తగాదాలు, చీటింగ్, అత్తరింటి వేదింపులు తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయి.
ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పీ రమణ కుమార్, ఒంగోలు రూరల్ సీఐ శేషగిరి రావు, కందుకూరు సీఐ అన్వర్ భాష, సంతమాగులూరు సీఐ కె.వెంకటరావు, ప్యానెల్ అడ్వొకేట్ బి.బాలాజీ సింగ్, సమస్యల పరిష్కార వేదిక ఎస్సై జనార్దన్ రావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
