ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం పీఎం సూర్యఘర్ పథకంలో భాగంగా రూ.1200 కోట్ల వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచిత సోలార్ యూనిట్లను ఏర్పాటు చేస్తుందని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. అద్దంకి మండలం, వేలమూరిపాడు గ్రామంలోని ఎస్సీ కాలనీలో 120 భవనాలపై నూతనంగా ఏర్పాటు చేసిన సోలార్ రూఫ్ టాప్ ప్యానెల్స్ ను మంత్రి గొట్టిపాటి ప్రారంభించారు. అనంతరం సోలార్ పనులు జరుగుతున్న ఎస్సీ కాలనీ ఇళ్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ., ఒక్క అద్దంకి నియోజకవర్గంలోని సుమారు 6 వేల ఎస్సీ కుటుంబాలకు ఒక్కో ఇంటికి రూ.1.25 లక్షల విలువైన సోలార్ యూనిట్లను పూర్తి ఉచితంగా ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త సహకారంతో ఏర్పాటు చేసే దీనికి రూ.80 కోట్ల వరకు ఖర్చువుతుందని తెలిపారు. వేలమూరిపాడు కాలనీకి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తామన్నారు. వేలమూరిపాడులోనే 4 సబ్ స్టేషన్లతో పాటు 450 నూతన విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశామన్నారు. దగ్గర దగ్గరగా నాణ్యమైన విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయడంతో రాబోయే 20, 30 సంవత్సరాలు ఇబ్బంది ఉండదన్నారు. తుఫాను, గాలులు వచ్చినా లో ఓల్టేజ్, అంతరాయాలు లేని విద్యుత్ సరఫరా జరుగుతుందన్నారు. 3 కేవీ సోలార్ రూఫ్ టాప్ యూనిట్లు ఏర్పాటు చేసుకునే బీసీ కుటుంబాలకు రూ.98 వేలు, ఓసీ కుటుంబాలకు రూ.78 వేలు సబ్సిడీ లభిస్తుందని మంత్రి వివరించారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 1.50 లక్షల బీసీ, ఓసీ కుటుంబాలకు సబ్సిడీ సోలార్ యూనిట్లు ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. పీఎం కుసుమ్ ద్వారా రైతులకు కూడా త్వరలోనే 9 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. ఈ పనులకు సంబంధించిన టెండర్లు పూర్తయ్యాయని, భూ సేకరణ చేస్తున్నామన్నారు. పీఎం కుసుమ్ పనులు కూడా త్వరలోనే ప్రారంభమవుతాయని తెలిపారు.
కక్షలు, వేధింపులతోనే జగన్మోహన్ రెడ్డి పాలన…
జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఐదేళ్ల వైసీపీ పాలన కక్షలు, వేధింపులు, భారాలతోనే సాగిందని మంత్రి గొట్టిపాటి విమర్శించారు. ఐదేళ్లలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై మోయలేని భారం వేశారని చెప్పారు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడి 25 నెలల్లో ఒక్క రూపాయి కూడా విద్యుత్ ఛార్జీ పెంచలేదని మంత్రి గుర్తు చేశారు. దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా రూ.13 పైసలు ట్రూ డౌన్ చేసి, వినియోగదారులు కట్టాల్సిన వందల కోట్ల రూపాయిల భారాన్నికూటమి ప్రభుత్వమే భరించిందన్నారు. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి స్పష్టం చేశారు. పేదలకు సంక్షేమ పథకాలను అమలు చేయడంలోనూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పక్షపాతంతో కక్షకట్టిందని మంత్రి గొట్టిపాటి ఆరోపించారు. 2014-19 మధ్య పేదలు నిర్మించుకున్న ఇళ్లకు బిల్లులు నిలిపివేసి వేధింపులకు గురి చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం అటువంటి చెండాలపు, దుర్మార్గపు పనులు చేయదని చెప్పారు. వైసీపీ ప్రభుత్వ హయాంలోని పేదల ఇళ్ల బిల్లులను కూడా కూటమిలో చెల్లిస్తున్నామని మంత్రి తెలిపారు. అదే విధంగా అర్హతలున్న, అవసరమైన వారందరకీ కొత్త ఇళ్లను మంజూరు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో లబ్ధిదారులతో పాటు కూటమి నేతలు, విద్యుత్, హౌసింగ్ శాఖల అధికారులు పాల్గొన్నారు.


