
ఒంగోలుకు ఎంతో చారిత్రక విశిష్టత ఉందని, ఈ ఘన చరితను చాటి చెప్పేలా, చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచేలా నిర్వహించే వేడుకలలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి పిలుపునిచ్చారు. ఒంగోలు మున్సిపాలిటీ ఏర్పడి సెప్టెంబర్ 30వ తేదీకి 150 ఏళ్లు అవుతున్న సందర్భంగా నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలకు సంబంధించిన బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం సాయంత్రం ఎన్టీఆర్ కళాక్షేత్రంలో అట్టహాసంగా జరిగింది. మంత్రితోపాటు జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన రావు, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ సంస్థ చైర్మన్ నూకసాని బాలాజీ, పిడిసిసి బ్యాంకు చైర్మన్ కామేపల్లి సీతారామయ్య, ఒంగోలు పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ షేక్ రియాజ్, ఒంగోలు ఏఎంసి చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ముప్పవరపు సుచిత్ర, ఇతర ప్రముఖులు ఇందులో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సొంత ఊరు అంటే ప్రతి ఒక్కరికీ ఎంతో ఇష్టం ఉంటుందన్నారు. గ్రామం నుంచి పట్టణముగా, నగరంగా అభివృద్ధి చెందిన మన జిల్లా కేంద్రమైన ఒంగోలుకు కూడా గొప్ప చరిత్ర ఉందన్నారు. ఈ నగరం మరింత విస్తరిస్తున్న నేపథ్యంలో మహిళల భద్రత, శాంతిభద్రతలలో మేటిగా నిలుస్తూ అత్యంత జీవనానుకూల నగరంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
కలెక్టర్ మాట్లాడుతూ మన ఒంగోలు - మన గౌరవం అన్నారు. ఈ నగర గొప్పతనాన్ని భావితరాలకు తెలిపేలా ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగానే ఒంగోలు నగరాన్ని అత్యంత సుందరీకరణ చేస్తున్నట్లు తెలిపారు. సుందర నగరం అంటే మన ఆత్మ గౌరవానికి ప్రతీక అన్నారు. ఈ ఏడాది డిసెంబర్లో ఒంగోలు నగరంలోనే ప్రపంచ బాలల తెలుగు మహాసభలు ఉన్నాయని, వచ్చే అతిథులకు మన నగర గొప్పదనాన్ని తెలిపేలా కూడా ఈ వేడుకలు, సుందరీకరణ, అభివృద్ధి పనులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
ఒంగోలు ఎమ్మెల్యే మాట్లాడుతూ 40 ఏళ్ల నాటి తాగునీటి పైపు లైన్లను మారుస్తున్నామని, మరో 40 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి పనులను చేస్తున్నామని చెప్పారు. డ్రైనేజీలను నిర్మిస్తున్నామన్నారు. మంగమూరు రోడ్డు, శ్రీనివాస థియేటర్, ట్రంకు రోడ్డు, కొత్తపట్నం రోడ్ల అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఇప్పటికే శానిటేషన్, విద్యుదీకరణ, సెంట్రల్ లైటింగ్ అభివృద్ధి చేశామన్నారు. ఈ అభివృద్ధి పనులను మరింత ముందుకు తీసుకువెళ్తామన్నారు. ఈ క్రమంలో నిర్వహించే 150 ఏళ్ల వేడుకలలో నగరానికి చెందిన వివిధ రంగాలలోని ప్రముఖులను కూడా ఆహ్వానిస్తామన్నారు. ఈ వేడుకలు ఈనెల 24వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని చెప్పారు. ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ వేడుకల నిర్వహణ, అభివృద్ధి పనులకు సంబంధించి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజల నుంచి సూచనలు, సలహాలు తీసుకున్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకట కృష్ణయ్య, ఇతర అధికారులు, మాజీ మేయర్ గంగాడ సుజాత, మాజీ ప్రజా ప్రతినిధులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.



