చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా భారతీయులందరూ పండుగలను జరుపుకోవడం చూస్తూ ఉంటాము. అసురుడైన నరకుడు తల్లి చేతిలోనే మరణం పొందాలని వరం పొందాడు. ఏ తల్లి తన బిడ్డను చంపుకోదు కదా అనే దుర్బుద్ధితో అలాంటి వరం బ్రహ్మ ద్వారా పొంది, ముల్లోకాల లోని ప్రజలను పలు ఇక్కట్లకు గురిచేస్తూ మునులు నిర్వహించే నిత్య హోమాగ్ని కి ఆటంక పరుస్తూ ఉండగా ఎంతో క్షమ గలిగిన భూమాత సైతం నరకుని కష్టాల నుండి భూమి పై నివసించే ప్రజలను, సకల జీవరాశిని రక్షించమని శ్రీ మహా విష్ణువుని మొరపెట్టుకోగా… శ్రీ మహావిష్ణువే ద్వాపరయుగము నందు శ్రీకృష్ణావతారము పొంది సత్యభామ సమేతుడై నరకునితో యుద్ధం చేయగా ఆ యుద్ధంలో కృష్ణుడు సోమసిల్లి పడిపోగా… అంతట సత్యభామ ధనుర్భాణాలను చేపట్టి నరకుని సంహరిస్తుంది. దుష్ట నరకుడు మరణించిన సందర్భమును దీపావళి గా భారతీయులందరూ పండుగ చేసుకోవడం ప్రతి ఇంటా దీపాల వరుసలను ఏర్పాటు చేసి శ్రీ మహా విష్ణు సమేత లక్ష్మీదేవిని పూజించడం రాత్రిపూట టపాసులు కాల్చి సందడి చేయడం చూస్తూ ఉంటాము.
దీపావళి పండుగను ఆల్ ఇండియా మహాత్మా సోషల్ క్లబ్ ఒంగోలు శాఖలు ఎయిమ్స్ క్లబ్ ఒంగోలు, ఎయిమ్స్ క్లబ్ వనిత ఒంగోలు మరియు ఎయిమ్స్ క్లబ్ ఒంగోలు జూనియర్స్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక మాతా శిశు వైద్యశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యశాలలోని బాలింతలకు, గర్భిణీ స్త్రీలకు పండ్లు, బ్రెడ్ మరియు పసిపిల్లలకు మెత్తటి జుబ్బాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆలిండియా మహాత్మా సోషల్ క్లబ్ పూర్వజాతీయ అధ్యక్షులు రాధా రమణ గుప్తా జంధ్యం మాట్లాడుతూ ….ఎప్పటిలాగే దీపావళి పండుగకు మాతా శిశు వైద్యశాలలో క్లబ్ సభ్యులందరితో కలిసి సేవాకార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఎయిమ్స్ క్లబ్ ఒంగోలు అధ్యక్షులు పబ్బిశెట్టి శ్రీనివాసరావు, కోశాధికారి ధనిశెట్టి రామునాయుడు, పూర్వ క్లబ్ కార్యవర్గ సభ్యులు నేరెళ్ల శ్రీనివాసరావు, డా. రంగారావు, మరియు డాక్టర్ చల్లా నాగేశ్వరమ్మ, తీగల సత్యవతి, జజ్జర కృష్ణవేణి, సుజాత, సూర్యనేని వెంకటలక్ష్మి, ఎస్. శ్రీనివాసరావు, సిహెచ్. శ్రీనివాసరావు, భూమా శ్రీనివాసరావు మరియు వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ అఖిల్, డాక్టర్ శ్వేత, నర్సింగ్ సిబ్బంది సుమతి సురేఖ తదితరులు పాల్గొన్నారు.





