తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని సనత్ నగర్ MLA అభ్యర్థి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఆదివారం రాత్రి ఆమీర్ పేట లోని మున్సిపల్ గ్రౌండ్ లో ఉత్తర్ భారతీయ ప్రవాసీ సేవా సంఘ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దీపావళి స్నేహ సమ్మేళన్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మినీ ఇండియాగా పిలుచుకునే హైదరాబాద్ లో వివిధ భాషలు, వివిధ ప్రాంతాలకు చెందిన వారు నివసిస్తున్నారని చెప్పారు. ఇక్కడ నివసించే వారంతా తెలంగాణ బిడ్డలేనని, వారిని తమ ప్రభుత్వం కడుపులో పెట్టుకొని చూస్తుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ నగరం ఎంతో అభివృద్ధి చెందిందని, దేశంలోని ముఖ్య నగరాలలో హైదరాబాద్ ఒకటిగా నిలిచిందని పేర్కొన్నారు. శాంతిభద్రతల పర్యవేక్షణ లో దేశంలోనే ప్రధమస్థానంలో ఉన్నామని, దేశంలోనే అత్యధిక CC కెమెరాలు ఏర్పాటు చేసిన నగరం కూడా హైదరాబాద్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం లో అన్ని రకాల వ్యాపారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ వ్యాపారాలు కొనసాగిస్తున్నారని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో దేశానికే తెలంగాణ రాష్ట్రం దిక్సూచి గా నిలిచిందని వివరించారు. 50 సంవత్సరాలలో జరగని అభివృద్ధి తొమ్మిదిన్నర సంవత్సరాల లో జరిగిందని చెప్పారు. భాష, ప్రాంతం ఏదైనా కేసీఆర్ ప్రభుత్వం వారి అభివృద్ధికి అన్ని విధాలా చేయూత ను అందిస్తుందని పేర్కొన్నారు. జైన్ సమాజ్ భవనం నిర్మాణం కోసం ఉప్పల్ భగాయత్ లో 2 ఎకరాల భూమి కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. మహావీర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు అందిస్తున్న సేవలను గుర్తించి లీజుకు ఇచ్చిన కోట్లాది రూపాయల విలువైన హాస్పిటల్ స్థలాన్ని ఉచితంగా కేటాయించడం జరిగిందని అన్నారు. పని చేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. తాను కూడా ప్రజలకు అన్నివేళలా అందుబాటులో ఉంటానని, ఇప్పటికే సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో అనేక అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. మరోసారి అత్యధిక మెజార్టీ తో గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని చెప్పారు. నవంబర్ 30 న జరిగే ఎన్నికలలో కారు గుర్తుపై ఓటేసి తనను బలపర్చాలని కోరారు. ఈ సమావేశంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ BRS ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, అగర్వాల్ సమాజ్ అధ్యక్షులు మనీష్ అగర్వాల్, జైన్ సమాజ్ అధ్యక్షుడు హన్స్ రాజ్ కొఠారి, హిమాన్షు బాప్నా, గులాబ్ సింగ్, ఉత్తమ్ సింగ్, చైన్ సింగ్, పీయూష్ గుప్తా, ఇంకా మహేశ్వరి సమాజ్, బెంగాలీ సమాజ్, బాలాజీ రాజస్థాన్ సమాజ్ ప్రతినిధులు పాల్గొన్నారు.


