అయోధ్య శ్రీ రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ ఆధ్వర్యంలో అయోధ్యలో నిర్మితమైన భవ్యమైన దివ్య రామ మందిరం వచ్చే 2024వ సంవత్సరం జనవరి 24వ తేదీ న స్వామివారి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరుగుచున్నది. ఆ కార్యక్రమానికి దేశ ప్రజలందరికీ ఆహ్వానాలు పంపుతూ ఈ నవంబరు ఐదవ తేదీ అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట వేడుకలు జరిపారు. ఆ వేడుకలలో స్వామివారి పాదస్పర్శతో పవిత్రమైన అక్షతలను ప్రతి గృహానికి చేర్చాలని వారు నిర్ణయం తీసుకొని అక్షతలను దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్ర విశ్వహిందూ పరిషత్ కార్యాలయాలకు పంపడం జరిగినది. అక్కడ నుండి జిల్లాలకు, జిల్లాల నుండి మండలాలకు, మండలాల నుండి గ్రామ గ్రామాన ఉండే ప్రజలకు చేర్చడానికి వారు పటిష్టమైన ఆరు అంచల విధానాన్ని పాటిస్తూ… శ్రీ రామ లల్లా విగ్రహ ప్రతిష్టామహోత్సవానికి ఆహ్వానంగా ఆ అక్షింతలను ప్రతి ఇంటికి చేరుస్తున్నారు. ఆ కార్యక్రమాల్లో స్థానిక హైందవ సంఘాలన్నీ కూడా పాల్గొంటున్నాయి అని విశ్వహిందూ పరిషత్ ప్రాంత సత్సంగ ప్రముఖ సోమ సుబ్బారావు వెల్లడించారు. 17వ తేదీ ఒంగోలు జిల్లాకు చేరిన పవిత్ర అక్షతలను స్థానిక గాంధీరోడ్డు గీతా మందిరం వద్ద నుండి బృందావన్ నగర్ శ్రీ మురళీకృష్ణ మందిరానికి మేళతాళములతో చేర్చామని, వానిని వృద్ధి చేసి 22వ తేదీ బుధవారం విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు తూనుగుంట మల్లిఖార్జునరావు అధ్యక్షతన శ్రీ మురళికృష్ణ మందిరంలో జరిగిన సమావేశములో… జిల్లాలోని 16 మండలాల నుండి విచ్చేసిన హైందవ సంఘ ప్రతినిధులకు అక్షతల కలశాలను శ్రీరామనామ మహామంత్ర సహితంగా అందజేశారు.
ఈ సందర్భంగా సోమ సుబ్బారావు మాట్లాడుతూ జనవరి 4 నుండి 15వ తేదీ వరకు ప్రతి గ్రామాల్లో స్థానిక హైంధవ సంఘ ప్రతినిధులతో కలిసి ప్రతి గృహానికి అందజేయడం జరుగుతుందని తెలిపారు. మరియు ప్రాణ ప్రతిష్ట జరిగే జనవరి 22వ తేదీ నాడు ప్రతి మండల కేంద్రాల్లో ఎల్ఈడి స్క్రీన్ లను ఏర్పాటు చేసి అయోధ్యలో జరిగే పవిత్ర ప్రతిష్ట కార్యక్రమాలను గ్రామ గ్రామాన ప్రజల వీక్షించేలా ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. కనుక ప్రతి ఒక్క హిందూ బంధువు ఈ అక్షతలను తమ గృహములో వృద్ధి చేసుకొని వానిని తమ ఇంట జరిగే శుభకార్యాల యందు వినియోగించుకొని స్వామివారి అనుగ్రహ కరుణా కటాక్ష విక్షణలకు పాత్రులు కావాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఉభయ తెలుగు రాష్ట్రాల అర్చక పురోహిత్ మఠమందిర ప్రముఖ్ శివశంకర్, ప్రాంత సత్సంగ ప్రముఖ సోమ సుబ్బారావు, విహెచ్పి జిల్లా అధ్యక్షులు తూనుగుంట మల్లికార్జునరావు, పురోహిత ప్రముఖ్ వ్యామజాల ప్రసన్న కుమార్ శర్మ, కార్యదర్శి ఐ సీతారామయ్య, ఉపాధ్యక్షులు జిల్లెలమూడి వెంకటేశ్వర్లు, నగర అధ్యక్షులు పసుమర్తి వెంకటేశ్వర్లు, కార్యదర్శి గోలిమి వెంకటేశ్వర్లు, ఈమని బలరాం, నగర సత్సంగ ప్రముఖ్ సుంకు రఘు, నేరెళ్ల శ్రీనివాసరావు, పబ్బిశెట్టి శ్రీనివాసరావు, పబ్బిశెట్టి హరిబాబు, రంగారావు, వెంకయ్య భైరవేశ్వర స్వామి ఏవి సత్యనారాయణ మరియు ప్రచార ప్రముఖులు రాధా రమణ గుప్తా జంధ్యం మరియు మండలాల నుంచి విచ్చేసిన హైందవ సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.



