అభివృద్ధి, సంక్షేమం బిఆర్ ఎస్ పార్టీతోనే సాధ్యం- సనత్ నగర్ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి శ్రీనివాస్ యాదవ్

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు BRS పార్టీతోనే సాధ్యమని సనత్ నగర్ MLA అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం రాత్రి అమీర్ పేట డివిజన్ లోని గంగుబాయ్ బస్తీ, బుద్ధనగర్, అంకమ్మ బస్తీ, హై ఎలైట్ వెల్ఫేర్ అసోసియేషన్, ఈడెన్ అపార్ట్మెంట్ లలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 50 సంవత్సరాలలో జరగని అభివృద్ధి ని తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తొమ్మిదిన్నర సంవత్సరాల లో చేశామని చెప్పారు. 2014 కు ముందు సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో రోడ్లు అద్వాన్నంగా ఉండేవని, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక రోడ్లపై మురుగునీరు ప్రవహించేదని తెలిపారు. తెలంగాణ వచ్చిన తర్వాత మెయిన్ రోడ్డు, బస్తీ రోడ్లు అనే తేడా లేకుండా అన్ని రోడ్లను ఎంతో అభివృద్ధి చేశామని వివరించారు. త్రాగునీటి సమస్యను పరిష్కరించామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే ప్రభుత్వం ప్లై ఓవర్ ల నిర్మాణం, పార్క్ లు, ఫుట్ పాత్ ల నిర్మాణం వంటి అభివృద్ధి పనులు చేసినట్లు చెప్పారు. పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని, పరిశ్రమలు, సాఫ్ట్ వేర్ రంగం అభివృద్ధి చెంది లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని అన్నారు. హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన ఘనత కూడా తెలంగాణ ప్రభుత్వానిదే అన్నారు. తాను నిత్యం ప్రజల మధ్య ఉంటూ సమస్యలను తెలుసుకొని పరిష్కరిస్తూ వస్తున్నా అన్నారు. సనత్ నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి లో ఆదర్శంగా నిలపాలనేది తన లక్ష్యం అన్నారు. తన కంటే ముందు ఎన్నికై ఉన్నతమైన పదవులలో ఉండి కూడా చేయలేని అభివృద్ధి తాను చేశానని అన్నారు. అంకమ్మ బస్తీ వాసులు ధైర్యంగా ఉండాలని, ఎన్నికల అనంతరం ఇండ్ల సమస్య పరిష్కరించే బాధ్యత తాను తీసుకుంటానని వారికి హామీ ఇచ్చారు. పెన్షన్ లు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు రాని వారు బాధపడొద్దని, మళ్ళీ మన ప్రభుత్వమే వస్తుంది, అందరికీ ఇస్తామని ప్రకటించారు. కారు గుర్తుపై ఓటేసి మరోసారి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. మంత్రి వెంట మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, డివిజన్ BRS అధ్యక్షులు హన్మంతరావు, బస్తీ అధ్యక్షులు గొలుసు సత్యనారాయణ, బాబూరావు, సంపత్, యాదగిరి, హై లైట్ ప్రతినిధులు పీయూష్ ప్రేమ్ గుప్త,అనురాధ, మోహిని, రమణ, యోగేష్, ఉత్తమ్ సింగ్, గులాబ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *