మిచాంగ్ తుఫాన్ నేపథ్యంలో తీరంలోని ఆక్వా రైతులు అప్రమత్తంగా ఉంచాలని జిల్లా మత్యశాఖాధికారి ఎ చంద్రశేఖర్ సూచించారు. తుఫాన్ సమయంలో తీర ప్రాంత మత్యకారులను, ఆక్వా రైతులకు ఇప్పటికే అప్రమత్తం చేసామని చెప్పారు. తుఫాన్ సమయంలో చేపలు కానీ రోయ్యలు కాని పట్టుబడి చేయరాదని చెప్పారు. మేతలు బాగా తగ్గించి వెయ్యాలని, ఎటువంటి రసాయన ఎరువులు కాని, రసాయన మందులు కాని చెరువులలో చల్లరాదని చెప్పారు. కరెంటు లభ్యత ఉన్నా లేకున్నా డీజిల్ ఇంజన్లు సిద్దం చేసుకోవాలని చెప్పారు. కొత్త రొయ్య పిల్లలు, చేప పిల్లలు వదులుగా కాని బదిలీ కాని చేయరాదని చెప్పారు. బలహీనంగా ఉన్న చెరువు గట్లలను ఇనుక బస్తాలతో పటిష్ట పరచుకోవాలని కోరారు. అధిక వర్షపాతానికి చెరువులు పొంగే అవకాశం ఉన్నందు వలన కొంత నీటిని ముందుగానే బయటకు తీసివెయ్యాలని చెప్పారు. చెరువు గట్ట మీద కాపాలా ఉండే వృద్ధులు, మహిళలు మరియు పిల్లలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరారు. మబ్బులు వర్షం కారణంగా ప్రాణ వాయువు స్థాయి తగ్గే అవకాశం ఉన్నందున పొటాషియం పర్మాంగనేట్ లేదా కాల్షియం పెరాక్సైడ్ లేదా ఆక్సిజన్లను సిద్దంగా ఉంచుకోవాలని చెప్పారు. పీతల చెరువులకు, గట్టు ఎత్తు తక్కువగా ఉన్న రొయ్య చెరువులకు 1 మీటర్ ఎత్తులో చెరువు చుట్టూ వలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అధిక వర్షపాతం కారణంగా ఉదజని సూచిక తగ్గే అవకాశం ఉన్నందున వర్షం తగ్గిన వెంటనే 1 ఎకరానికి 50 నుంచి 100 కేజీల వ్యవసాయ సున్నం వాడుకోవాలలని చెప్పారు. చనిపోయిన చేపలను వెంటనే తీసివేసి గోతిలో సున్న వేసి కప్పి వెయ్యాలని కోరారు. రొయ్యల చెరువులో వర్షం తగ్గిన వెంటనే చెరువులలోని వర్షపు నీటిని బయటకు పంపివెయ్యాలని చెప్పారు. చెరువు గట్ల మీద విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని కోరారు.

