కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రకటించిన తులం బంగారం మహిళలకు ఎప్పుడు ఇస్తారని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం సికింద్రాబాద్ తహశీల్దార్ కార్యాలయంలో బేగంపేట, రాంగోపాల్ పేట, మోండా మార్కెట్, బన్సీలాల్ పేట డివిజన్ లకు చెందిన 70 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ 58, షాదీముబారక్ 12 చెక్కులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదింటి ఆడపడుచు పెండ్లికి ఆర్ధిక సహాయం అందించి అండగా నిలవాలనే ఆలోచన తో బి ఆర్ ఎస్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ కార్యక్రమాన్ని చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ అసెంబ్లీ ఎన్నికల ముందు కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ లబ్ధిదారులకు తులం బంగారం ఇస్తామని ప్రకటించి ఏడాది కావస్తున్నా, ఇవ్వడం లేదని, ఎప్పుడు ఇస్తారనేది ప్రభుత్వం స్పష్టం చేయాలని లబ్ధిదారులు అడుగుతున్నారని వివరించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఆర్ డి ఓ, తహశీల్దార్ లను ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్ కోరారు. లబ్ధిదారులకు ఆర్ధిక సహాయం అందించడంలో జాప్యం జరుగుతుందని, ఆలస్యం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ ఆర్ డి ఓ సాయిరామ్, బేగంపేట, బన్సీలాల్ పేట కార్పొరేటర్ లు టి. మహేశ్వరి, కుర్మ హేమలత, మాజీ కార్పొరేటర్ అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, తహశీల్దార్ పాండు నాయక్, బి ఆర్ ఎస్ డివిజన్ అధ్యక్షులు ఆకుల హరికృష్ణ, అత్తిలి శ్రీనివాస్ గౌడ్, వెంకటేషన్ రాజు తదితరులు పాల్గొన్నారు.


