వారాంతపు లక్ష్యాలను నిర్దేశించుకుని ఇళ్ల నిర్మాణాల్లో స్పష్టమైన పురోగతి ఉండేలా పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా
స్పష్టం చేశారు. శుక్రవారం ప్రకాశం భవనములోని గ్రీవెన్స్ హాలులో హౌసింగ్ పథకముపై సంబంధిత అధికారులతో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ….
జూన్ 12వ తేదీన సామూహికంగా గృహ ప్రవేశ కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినందున జిల్లాలో లక్ష్యం మేరకు ఇళ్ల
నిర్మాణాలు పూర్తయ్యేలా చూడాలని చెప్పారు. ముఖ్యంగా ఆప్షన్ – 3, పీఎం జన్ మన్ ఇళ్ల
నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. పిఎం జన్ మన్ ఇళ్ళ నిర్మాణంలో పురోగతిని నేరుగా ప్రధానమంత్రి కార్యాలయం నుంచి పర్యవేక్షిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసుకునేందుకు ప్రభుత్వం అదనముగా ఆర్థిక సహాయం చేస్తున్నందున ఈ డబ్బులను కేవలం ఇళ్ల నిర్మాణాలకే లబ్ధిదారులు ఉపయోగించుకునేలా చూడాలని అధికారులకు ఈ సందర్భంగా కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. ఇది కేవలం హౌసింగ్ డిపార్ట్మెంట్ పని అంటూ ఎంపీడీవోలు తేలికగా తీసుకుంటే ఊరుకోనని ఆమె హెచ్చరించారు. మండల స్థాయి ప్రత్యేక అధికారులు కూడా ఈ విషయంపై మరింత దృష్టి సారించాలని కలెక్టర్ చెప్పారు.
ఈ సమావేశంలో హౌసింగ్ పీడీ శ్రీనివాస ప్రసాద్, జడ్పీ సీఈవో చిరంజీవి, మండలాల ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, హౌసింగ్ ఈ.ఈ.లు, డి.ఈ.ఈ.లు, ఏ.ఈ.ఈ.లు పాల్గొన్నారు.
ఆరేళ్ల లోపు చిన్నారులకు ఆధార్ కార్డులు జారీ చేసేలా చూడడంలో నిర్లక్ష్యం తగదు….
ఆరేళ్ల లోపు చిన్నారులకు ఆధార్ కార్డులు జారీ చేసేలా చూడడంలో నిర్లక్ష్యం తగదని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. సంబంధిత అధికారులతో శుక్రవారం ప్రకాశం భవనంలోని గ్రీవెన్స్ హాల్లో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ…. ప్రతి చిన్నారికి ఆధార్ కార్డు ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సైతం ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సాధించి సమీక్షిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ దృష్ట్యా జనన ధ్రువీకరణ పత్రం ఉన్న చిన్నారులకు తక్షణమే ఆధార్ కార్డుల జారీ కోసం వివరాలను నమోదు చేయించాలని కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. ఈ వివరాల నమోదు కోసం చిన్నారులను ప్రత్యేక శిబిరాలకు తరలించి, పోస్ట్ ఆఫీసులు, కామన్ సర్వీస్ సెంటర్లలోని సిబ్బందిని అక్కడకు తీసుకువెళ్లేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జనన ధ్రువీకరణ పత్రాలు లేని చిన్నారులు గుర్తించి వారు జన్మించిన ఆసుపత్రుల వివరాలు తెలుసుకొని ఏ విధంగా జనన ధ్రువీకరణ పత్రాలను పొందవచ్చో వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ చెప్పారు. మండల స్థాయి ప్రత్యేక అధికారులు కూడా క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లినప్పుడు ఆయా విషయాలను సమీక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా సచివాలయాల ద్వారా అందే సేవలు ” మనమిత్ర ” యాప్ లో కూడా అందుబాటులో ఉన్నాయని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ” శక్తి ” మొబైల్ యాప్ ను అందరూ డౌన్లోడ్ చేసుకునేలా చూడాలన్నారు.
ఈ సమావేశంలో జడ్పీ సీఈవో చిరంజీవి, మండలాల స్పెషల్ ఆఫీసర్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, సిడిపిఓలు పాల్గొన్నారు.
చిన్నారుల గుర్తింపు సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి…..
దుర్బలమైన ( వల్నరబుల్ ) చిన్నారుల గుర్తింపు సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. ఇలాంటి పిల్లల సమగ్ర ఎదుగుదలే లక్ష్యంగా జిల్లాలో ‘ బంగారు బాల్యం ‘ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు ఆమె చెప్పారు. శుక్రవారం సంబంధిత అధికారులతో ప్రకాశం భవనంలోని గ్రీవెన్స్ హాలులో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ…. బంగారు బాల్యం కార్యక్రమ లక్ష్యాన్ని పునరుద్ఘాటించారు. ఇందుకోసం దుర్బలమైన పిల్లల వివరాలను సేకరించేందుకు సర్వే నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా మొబైల్ , వెబ్ యాప్ ను రూపొందించినట్లు ఆమె చెప్పారు. ఈ యాప్ లో పొందుపరిచిన వివరాలను, దీని పనితీరును బంగారు బాల్యం నోడల్ ఆఫీసర్ గిరిధర్ శర్మ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
రాచర్ల మండలంలో ఇప్పటికే ఈ సర్వేను సమర్థవంతంగా నిర్వహించినట్లు కలెక్టర్ తెలిపారు. ఇతర మండలాల్లో కూడా సర్వే చేయాల్సి ఉన్నందున ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. త్వరలోనే డివిజన్ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామన్నారు. వివిధ సంక్షేమ కార్యక్రమాలను సమ్మిళితం చేసి దుర్భలమైన పిల్లలకు, వారి కుటుంబాలకు సమర్థంగా అవి అందేలా ప్రత్యేక దృష్టి సారించినట్లు కలెక్టర్ తెలిపారు. తద్వారా ఆయా కుటుంబాలు పేదరికం నుంచి బయటపడేలా, దుర్భలమైన పిల్లలు కూడా ఎలాంటి వేధింపులు, దోపిడీకి గురికాకుండా సాధికారత దిశగా ఎదిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా తాజాగా పీ-4 కార్యక్రమాన్ని ప్రారంభించడాన్ని ఆమె ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలతో పాటు ‘ బంగారు కుటుంబా’లకు సహాయం చేసేలా ‘ మార్గదర్శ ‘ కులను కూడా ఇదే సమయంలో గుర్తించాలన్నారు. బంగారు కుటుంబాల పై మండలాల ప్రత్యేక అధికారులు కూడా మరింత దృష్టి పెట్టి సమీక్షించాలని కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో మండలాల ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, ఎంఈఓలు, సిడిపిఓలు పాల్గొన్నారు.


