గ్రామ స్థాయిలో పారిశుధ్య కార్యక్రమాలతో పాటు ప్రజలకు సురక్షితమైన త్రాగు నీరు అందించేలా పంచాయతీ రాజ్ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ అన్సారియా
పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాలులో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపిడిఓలతో సమావేశమై జిల్లా లో జరుగుచున్న పంచాయతీ రాజ్ కార్యక్రమాలను సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…. గ్రామ స్థాయిలో పారిశుధ్య కార్యక్రమాలతో పాటు ప్రజలకు సురక్షితమైన త్రాగు నీరు అందించేలా పంచాయతీ రాజ్ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా 3వ శనివారం ప్రతి నెలా ఒక్కో అంశంతో నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర – స్వచ్చాంధ్ర కార్యక్రమాన్ని క్షేత్ర స్థాయిలో విజయవంతంగా నిర్వహించాలన్నారు. ముఖ్యంగా గ్రామాల్లో నిర్మించిన చెత్త నుండి సంపద సృష్టి కేంద్రాలు పటిష్టంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి 250 కుటుంబాలకు క్లాప్ మిత్ర లను నియమించడం జరిగిందని, గ్రామాలలో చెత్త సేకరణ విధులు ఖచ్చితంగా జరిగేలా చూడాలన్నారు. ఓవర్ హెడ్ ట్యాంకు ల క్లీనింగ్ ప్రక్రియ 15 రోజుకొకసారి ఖచ్చితంగా జరిగేలా చూడటంతో పాటు బ్లీచింగ్ తగిన మోతాదులో కలిపేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్, పంచాయతీ రాజ్ అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సిఈఓ చిరంజీవి, డిపిఓ వెంకట నాయుడు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపిడిఓ లు తదితరులు పాల్గొన్నారు.
