జిల్లాలో ఎక్కడా త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా, అధికారులను ఆదేశించారు.
శుక్రవారం కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాలులో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపిడిఓలతో, మునిసిపల్ కమీషనర్లతో సమావేశమై వేసవిలో త్రాగునీటి సరఫరా పై తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై సమీక్షించి దిశానిర్దేశం చేసారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ….. ఎక్కడా ప్రజలు త్రాగునీటికి ఇబ్బంది పడరాదని రాష్ట్ర్త ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందని, అందు కనుగుణంగా వేసవిలో సురక్షిత త్రాగునీటి సరఫరా పై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి జిల్లాలో ఎక్కడా త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలందరికీ రక్షిత మంచినీరు అందించేందుకు రక్షిత త్రాగునీటి పథకాలలోని ఫిల్టర్ బెడ్స్ కు మరమ్మత్తులు చేయించాలన్నారు. అందుకవసరమైన నిధుల కోసం వెంటనే ప్రతిపాదనలు పంపాలని జిల్లా కలెక్టర్, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. బోర్ వెల్స్ పూర్తిస్థాయిలో పనిచేసేలా చూడాలని, అవసరమైన వాటికి మరమ్మత్తులు చేయించాలన్నారు. ఈ నెల 15వ తేదీ నుండి త్రాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేస్తున్నందున, జిల్లాలోని అన్ని గ్రామాలలోని త్రాగునీటి వనరులను పూర్తిస్థాయిలో నింపుకోవాలని జిల్లా కలెక్టర్, అధికారులను ఆదేశించారు. జిల్లా లో ఎక్కడా త్రాగునీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవడంతో పాటు ఎప్పటికప్పుడు ఓవర్ హెడ్ ట్యాంకులను, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు లను శుభ్రం చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, పంచాయతీ రాజ్, మునిసిపల్ అధికారులను ఆదేశించారు. ఆర్డబ్ల్యూఎస్, జిల్లా పరిషత్, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. ప్రజల త్రాగునీటి అవసరాల కోసం ఒంగోలు జల్ శక్తి కేంద్రంలో 9618055155 టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా టోల్ ఫ్రీ నెంబర్ అవగాహన కొరకు రూపొందించిన వాల్ స్టికర్ ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.
ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సిఈఓ చిరంజీవి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ బాల శంకర రావు, డిపిఓ వెంకట నాయుడు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపిడిఓలు, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అధికారులు తదితర పాల్గొన్నారు.

