హైదరాబాద్ మే 13,(జే ఎస్ డి ఎం న్యూస్ ప్రధాన ప్రతినిధి ) :
తెలంగాణ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ సందీప్ కుమార్ సుల్తానియా నియమతులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణా రావు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా సందీప్ కుమార్ సుల్తానీయాకు భట్టి విక్రమార్క శుభాకాంక్షలు తెలిపారు. 1998 బ్యాచ్‌కు చెందిన సందీప్ కుమార్ సుల్తానియా బిహార్ రాష్ట్రానికి చెందిన వారు. చార్టర్డ్ అకౌంటెంట్‌గా అకౌంటెన్సీ విభాగంలో ఆయన గ్రాడ్యుయేట్. తొలుత ఆయన తెలంగాణ ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీగా పని చేశారు. అనంతరం ముఖ్యమంత్రి కార్యదర్శిగా కూడా విధులు నిర్వర్తించారు. ఆర్థిక, రవాణా, సహకార సంస్థలు, పర్యాటక రంగాల్లో కీలక పదవుల్లో కొనసాగారు. గ్రామీణాభివృద్ధి, భూ రెవెన్యూ నిర్వహణ, పట్టణాభివృద్ధిలో అపార అనుభవం ఆయన సొంతం. ప్రస్తుతం ప్రభుత్వ ప్రణాళిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పని చేస్తున్న ఆయన తాజాగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమతులయ్యారు.
