దర్శి సబ్ డివిజన్ పోలీస్ స్టేషన్ల పనితీరుపై సమీక్ష సమావేశం నిర్వహించిన ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు – పెండింగ్ కేసులపై ప్రత్యేక శ్రద్ద వహించి త్వరితగతిన పరిష్కరించాలి – జిల్లా ఎస్పీ

పెండింగ్ లో ఉన్న గ్రేవ్ & నాన్ గ్రేవ్ కేసులు దర్యాఫ్తు వేగవంతం చేయాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ గారు ఆదేశించారు. దర్శి సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్ల పనితీరుపై, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాలు, NBWs,డిపిఓ పెండింగ్ రిప్లయ్స్ పై జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు సోమవారం దర్శి పోలీస్ స్టేషన్ లో డిఎస్పీ, సీఐలు, ఎస్సైలతో సమావేశం నిర్వహించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ సమీక్షా సమావేశంలో ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు పోలీస్ స్టేషన్ల వారీగా పెండింగ్ కేసుల వివరాలు, అరెస్టు, కేసు దర్యాప్తు తీరుతెన్నులపై సంబంధిత పోలీస్ అధికారులతో ఆరా తీసి, కేసుల ఛేదింపునకు మరియు పరిష్కారానికి, నేర నియంత్రణకు దోహదం చేసే పలు సూచనలు మరియు మెళకువలను అధికారులకు దిశా నిర్దేశాలు చేశారు. పోలీస్ స్టేషన్ల వారీగా యూఐ కేసులు తగ్గించుకోవాలని, వీలైనంత త్వరగా పెండింగ్ కేసులను పరిష్కార దశకు తీసుకురావాలని, అరెస్టులు, చార్జ్ షీట్లు, నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్ లో ఉంచకుండా సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.

ప్రాపర్టీ నేరాల్లో నిందితులను త్వరగా పట్టుకోని ప్రాపర్టీ రికవరీ శాతాన్ని పెంచాలని, చట్టవ్యతిరేక/అసాంఘిక కార్యకలాపాలపై నిఘా ఉంచి కట్టడి చెయ్యాలన్నారు. అలాగే గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల రవాణా, విక్రయాలు, వినియోగాన్ని పూర్తిగా అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గంజాయి కేసుల నమోదులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి నిందితులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్ఫోర్స్‌మెంట్ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. పేకాట, కోడి పందాలు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, ప్రజా ప్రశాంతతకు భంగం కలిగించే అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

పాత నేరస్తులపై నిఘా ఉంచాలని, వారిని బైండ్ ఓవర్ చేయాలనీ, బైండవర్ ఉల్లఘించిన వారిపై తగ్గు చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రంక్ &డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు.

అలాగే ప్రతి మండల పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా మహిళా/పిల్లలు భద్రత, సైబర్ నేరాలు,రోడ్డు భద్రతా, ట్రాఫిక్ నియమాలు, మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలు, చట్టాలు, శిక్షలపై అవగాహన వంటి అంశాలపై ప్రజలను నిరంతరం అప్రమత్తం చేస్తున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు.

రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ప్రకాశం, మార్కాపురం రెండు జిల్లాల వ్యాప్తంగా 220 కుంభాకార దర్పణాలు (Convex Mirrors) ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో బ్లాక్ స్పాట్లు మరియు ప్రమాదంలో జరగడానికి అవకాశం ఉన్న ప్రదేశాలలో కుంభాకార దర్పణం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సర్వీస్ రోడ్డు నుండి జాతీయ రహదారిపై ప్రవేశించే సమయంలో తప్పనిసరిగా వాహనాన్ని ఆపి, ఇరువైపులా పరిశీలించి తర్వాత మాత్రమే ముందుకు సాగాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, కారు డ్రైవ్ చేసే వారు సీట్ బెల్ట్ ధరించాలని, సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం ప్రమాదమని, ఇది మీ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు కలిగిస్తుందని హెచ్చరించారు. ప్రజలు మరియు వాహనదారులు ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ, బాధ్యతాయుతంగా వ్యవహరించి పోలీసులకు సహకరించాలని జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు విజ్ఞప్తి చేశారు.

బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగే ప్రదేశాలను గుర్తించి ప్రజల, మునిసిపల్ కార్మికుల వారి సహకారంతో వాటిని శుభ్రం చేయించటం జరిగిందని, అలా చేయటం ద్వారా న్యూసెన్స్ తగ్గి శారీరిక నేరాలు తగ్గాయన్నారు. గతంలో కంటే ప్రస్తుతం నేరాలు తగ్గుముఖం పట్టిందన్నారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే… అలాంటి వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో దర్శి డిఎస్పీ బాలమురళి కృష్ణ, ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, డిసిఆర్బిసిఐ దేవ ప్రభాకర్, దర్శి సీఐ రామారావు,అద్దంకి అర్బన్ సీఐ సుబ్బరాజు, అద్దంకి రూరల్ సీఐ మల్లికార్జున రావు,చీమకుర్తి సీఐ ప్రసాద్ సబ్ డివిజన్ ఎస్సైలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *