రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖలు మరింత సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు అన్నారు. ఈ దిశగా చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇస్తుండడంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం ప్రకాశం భవనంలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశం జరిగింది. ఎస్పీ వి.హర్ష వర్ధన్ రాజుతో కలిసి జిల్లాలోని పరిస్థితిపై ఆయన సమీక్షించారు. గత సమావేశంలో చర్చించిన అంశాలు, వాటిపై తీసుకున్న చర్యల నివేదికను డిటిసి ఆర్.సుశీల ఈ సందర్భంగా వివరించారు.
దీనిపై కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా యంత్రాంగం దృష్టి సారించింది అన్నారు. తాను, ఎస్పీ కలిసి ఒంగోలు నగరంతో పాటు అద్దంకి, సంతమాగులూరు ప్రాంతాలలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను ఇటీవల సందర్శించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. క్షేత్రస్థాయి అధికారులు కూడా తమ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణ కు సమిష్టిగా పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. వాహనదారులకు కూడా రోడ్డు భద్రత నియమాలపై నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన చెప్పారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు పోలీసులు, వైద్యులు, ఇతర అధికారులు స్పందిస్తున్న
తీరును ఆయన అభినందించారు. ఇదే స్ఫూర్తితో నిరంతరం పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఎస్పీ మాట్లాడుతూ గత ఏడాది మొదటి ఏడు నెలల కాలంతో పోల్చితే ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు రోడ్డు ప్రమాద మరణాలు 18.5 శాతం తగ్గాయని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు అధికారులు స్పందించే సమయం కూడా తగ్గిందని, సగటున ఎనిమిది నిమిషాలలోనే స్పందిస్తున్నారని చెప్పారు. రోడ్డు ప్రమాదాలు కూడా 3.5 శాతం తగ్గినట్లు వివరించారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడుపుతున్న 39,182 మందికి ఈ ఏడు నెలల కాలంలో రూ.2.38 కోట్ల జరిమానా విధించామన్నారు. ఇందులో రూ.1.34 కోట్ల వరకు వసూలు అయ్యాయి అన్నారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 1869 మందికి ఒక కోటి రూపాయలకు పైగా జరిమానా విధించామని, 67 మందికి జైలు శిక్ష పడిందని చెప్పారు. జిల్లాలో వాహనాలకు నిబంధనలకు విరుద్ధంగా అమర్చిన 9 వేలకు పైగా ఎల్ఈడీ లైట్లను పోలీసు, రవాణా సిబ్బంది తొలగించినట్లు ఆయన వివరించారు. విద్యా సంస్థల బస్సుల ఫిట్నెస్ పైనా నిరంతరం దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి వీటిని పరీక్షించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఈ సమావేశంలో డిఎంహెచ్వో వెంకటేశ్వర్లు, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ జిల్లా కోఆర్డినేటర్ హేమంత్, రోడ్లు భవనాల శాఖ ఎస్.ఈ. రవి నాయక్, పంచాయతీ రాజ్ ఎస్.ఈ.అశోక్, ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సత్యనారాయణ, జాతీయ రహదారుల సంస్థ అధికారులు, జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు.

