ప్రతి అర్జీని సీరియస్ గా తీసుకుంటాం. మీ సమస్యకు సత్వర పరిష్కారం చూపుతాం…..జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు

‘ ప్రతి అర్జీని సీరియస్ గా తీసుకుంటాం. మీ సమస్యకు సత్వర పరిష్కారం చూపుతాం. అందుకే జిల్లా అధికార యంత్రాంగం మొత్తం మీ మధ్యకు వచ్చింది. ఆర్థికేతర సమస్యలపై అధికారులు తక్షణమే దృష్టి సారిస్తారు. ఆర్థికపరమైన సమస్యలను కూడా రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం ‘… అని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు స్పష్టం చేశారు. గురువారం ఆయన జె.పంగులూరు మండలం తూర్పు కొప్పెరపాడు గ్రామంలో ‘ పల్లెనిద్ర ‘ చేశారు. జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారితో కలిసి ప్రజలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. స్థానికుల మంచి అర్జీలను స్వీకరించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

              ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామస్థాయిలో ప్రజలతో ముఖాముఖి చర్చించి వారి సమస్యలను సత్వరం పరిష్కరించేందుకే గత 13 వారాలుగా ‘ పల్లెనిద్ర ‘ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మెరుగైన జీవనోపాధి కోసం ఉపయోగించుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘ మనమిత్ర ‘ వాట్సప్ సేవలు, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే ‘ కౌశలం ‘, విపత్తుల సమాచారాన్ని క్షణాల్లో ప్రజలకు అందుబాటులో ఉంచే ‘ అవేర్ 2.0 ‘ ఆన్లైన్ పోర్టల్ గురించి స్వయంగా కలెక్టరే ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామంలోని గర్భిణులతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. తల్లీబిడ్డ ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. అంగన్వాడీ, ఏ.ఎన్.ఎం.ల ద్వారా లభిస్తున్న సేవలను వినియోగించుకోవాలని, పోషకాహారం తీసుకుంటూ సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కాగా, వైద్యుల ద్వారా పొందుతున్న సేవలపై గర్భిణులు సంతృప్తి వ్యక్తం చేశారు.

               స్థానికులు మాట్లాడుతూ గ్రామంలో జాయింట్ ఎల్.పి.ఎం. సమస్యలు ఎక్కువగా ఉన్నాయని పలువురు రైతులు ఈ సందర్భంగా కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దళితవాడ స్మశాన దారి ఆక్రమణకు గురైందని, పట్టా భూములు కూడా నిషేధత 22(ఏ) జాబితా నమోదయ్యాయని స్థానికులు తెలిపారు. ఊరు నుంచి మండల స్థాయి ఆసుపత్రికి వెళ్లే రోడ్డు బాగోలేదని, గ్రావెల్ రోడ్డు స్థానంలో తారు రోడ్డు కావాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు. డ్రైనేజీలు కావాలని, సీ.సీ. రోడ్లు కావాలని కోరారు.
                  
                 గ్రామస్తులు ప్రస్తావించిన సమస్యలను కలెక్టర్ ఓపికతో విన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి తక్షణమే దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని, అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఆర్థికేతర సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.
      
               ఈ కార్యక్రమంలో జెడ్పీ సీ.ఈ.వో. చిరంజీవి, డిపిఓ అనుపమ, స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు సచివాలయాల జిల్లా అధికారి వెంకటేశ్వరరావు, ఆర్డిఓ విజయ జ్యోతి, వివిధ శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

          దీనికి ముందుగా మండలంలోని అన్ని గ్రామాల్లో జిల్లా స్థాయి అధికారులు పర్యటించి స్థానిక సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. వాటిని పల్లెనిద్ర కార్యక్రమంలో కలెక్టర్ దృష్టికి తెచ్చారు. కాగా, ఈ సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు తక్షణమే దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *