సికింద్రాబాద్ ఆగస్ట్ 13
(జే ఎస్ డి ఎం న్యూస్) :
భుజం నొప్పితో సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చేరిన ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ శస్త్రచికిత్స అనంతరం గురువారం డిశ్చార్జ్ అయ్యారు. ఇటీవల ఆయనకు ఆర్థ్రోస్కోపిక్ భుజం శస్త్రచికిత్స విజయవంతంగా జరిగినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఫొటోలతో పాటు హెల్త్ బులెటిన్‌ను వైద్యులు విడుదల చేశారు.
డాక్టర్ ఆర్.ఏ. పూర్ణచంద్ర తేజస్వి, డాక్టర్ నితిన్ బెజంకి నేతృత్వంలోని వైద్య బృందం ఈ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించింది. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా నిలకడగా ఉందని కిమ్స్ వైద్యులు తెలిపారు. శస్త్రచికిత్స అనంతరం ఆయనకు నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందించినట్లు పేర్కొన్నారు.
ఆయన పూర్తి స్థాయిలో కోలుకునేందుకు ఇకపై క్రమబద్ధమైన పునరావాస (రీహాబిలిటేషన్) కార్యక్రమాన్ని కొనసాగించనున్నట్లు ఆస్పత్రి వర్గాలు స్పష్టం చేశాయి. కాగా, ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని కిమ్స్ ఆస్పత్రి సీఎండీ డాక్టర్ భాస్కరరావు ఆకాంక్షించారు. ఆస్పత్రి మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ సంబిత్ సాహు ఈ మేరకు అధికారిక ఆరోగ్య బులెటిన్‌ను విడుదల చేశారు.

