స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తితో వికసిత భారత్, స్వర్ణాంధ్ర – 2047 లక్ష్యాల సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి పిలుపునిచ్చారు. శనివారం ఒంగోలులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన 80 వ స్వాతంత్ర్యదిన వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు, ఎస్.పి. వి.హర్షవర్ధన్ రాజుతో కలిసి ప్రత్యేక వాహనంలో ప్రయాణించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. రాష్ట్రాన్ని 2047 నాటికి సుమారు రూ.200 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దటం, ప్రతి ఒక్కరి తలసరి ఆదాయాన్ని సుమారు రూ.36 లక్షలకు పెంచటం, ఏటా 15 శాతానికి పైగా వృద్ధిరేటు సాధించడం ప్రధాన లక్ష్యాలుగా ముందుకు వెళుతున్నట్లు చెప్పారు. ఈ దిశగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఈ సందర్భంగా తన ప్రసంగంలో మంత్రి వివరించారు.
ఈ వేడుకలలో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్ధన రావు, సంతనూతలపాడు శాసనసభ్యులు బి.ఎన్. విజయ్ కుమార్, రాష్ట్ర మ్యారీటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, ఒంగోలు పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ షేక్ రియాజ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ముప్పవరపు సుచిత్ర, కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశీ, డిఆర్ఓ పి.వి.రమణ, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఈ వేడుకలకు హాజరైన స్వాతంత్ర్య సమరయోధులు టంగుటూరి ప్రకాశం పంతులు, కరువది వెంకటేశ్వర్లు, గంగవరపు వందనం, ఆదిపూడి వెంకటసుబ్బారావు, గొల్లపూడి వీరాస్వామి గార్ల కుటుంబ సభ్యులను మంత్రి, ప్రజా ప్రతినిధులు, కలెక్టర్, ఎస్పీ, జాయింట్ కలెక్టర్ స్వయంగా వారి సీట్ల వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించి ఘనంగా సత్కరించారు.
ఆకట్టుకున్న శకటాలు, స్టాల్స్, సాంస్కృతిక ప్రదర్శనలు
వ్యవసాయ, దాని అనుబంధ విభాగాలు, పంచాయతీ, డీ.ఆర్.డీ.ఏ, డ్వామా, మెడికల్, ఎక్సైజ్ – ప్రొహిబిషన్, సాంఘిక సంక్షేమం, విద్య, ఏపీఎస్ఆర్టీసీ, గనులు – భూగర్భ వనరుల శాఖలు తమ పరిధిలో అమలు చేస్తున్న పథకాలను తెలియజేసేలా ప్రదర్శించిన శకటాలు ఆకట్టుకున్నాయి. అదేవిధంగా ఐసిడిఎస్, ఆర్డబ్ల్యూఎస్, మెప్మా, విద్యాశాఖ, మత్స్యశాఖ, స్వర్ణ గ్రామ – స్వర్ణ వార్డు శాఖ, ఇరిగేషన్, పరిశ్రమలు, అటవీ, కార్మిక, వ్యవసాయ, ప్రకృతి సేద్యం, పశుసంవర్ధకం శాఖలు ఏర్పాటు చేసిన ప్రదర్శనశాలలను కూడా మంత్రి, కలెక్టర్, ఎస్పి, జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్
ఆసక్తిగా వీక్షించారు. రైస్ ఇంజనీరింగ్ కాలేజ్,
డ్రీమ్స్ ఉన్నత పాఠశాల, భాష్యం ఉన్నత పాఠశాల, శ్రీ సూర్య నికేతన్, పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ విద్యార్థులు దేశభక్తిని చాటేలా ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకర్షించాయి. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని రక్షించడంలో వివిధ ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పని చేసే విధానాన్ని తెలిపేలా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రదర్శన ఆకట్టుకుంది.
విజేతలు వీరే…
శకటాల రూపకల్పన, సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనలో ప్రతిభ చూపినవారికి మంత్రి స్వామి జ్ఞాపికలను అందించారు. శకటాలలో మెడికల్, డ్వామా, వ్యవసాయ - దాని అనుబంధం శాఖలు వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. డిఆర్డిఏ కు కన్సోలేషన్ బహుమతి లభించింది. స్టాల్స్ లో స్వర్ణ గ్రామ - స్వర్ణ వార్డు సచివాలయ, కార్మిక, పశు సంవర్ధక శాఖలు మొదటి మూడు స్థానాలలో నిలిచి బహుమతులు పొందాయి. సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించిన వారిలో డ్రీమ్స్ హై స్కూల్, పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ, శ్రీ సూర్య విద్యా నికేతన్ లకు తొలి మూడు బహుమతులు వచ్చాయి. భాష్యం స్కూల్ విద్యార్థులకు కన్సోలేషన్ బహుమతి దక్కింది. రహదారి భద్రతపై అవగాహన కల్పించిన వివిధ శాఖల సిబ్బందితో కూడిన బృందానికి కూడా ప్రత్యేక బహుమతిని మంత్రి ప్రదానం చేశారు.
ప్రతిభకు పట్టం
విధుల నిర్వహణలో చిత్తశుద్ధితో పని చేస్తూ ప్రతిభను చూపిన అధికారులకు, సిబ్బందికి, విశిష్ట సేవలు అందించిన స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు కలిపి మొత్తం 680 మందికి ప్రతిభ పురస్కారాలను ఈ వేడుకలలో మంత్రి ప్రదానం చేశారు.
రూ.358.58 కోట్ల చెక్కులు పంపిణీ
డిఆర్డిఏ సభ్యులకు రూ.325.70 కోట్లు, మెప్మా సభ్యులకు రూ.32.72 కోట్ల రుణాలను, ఏపీఎంఐపి పథకంలో లబ్ధిదారులకు రూ.16 లక్షల విలువైన బ్యాంకు చెక్కులను మంత్రి అందించారు.
కలెక్టరేట్లో…
దీనికి ముందుగా ప్రకాశం భవనంలో జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారితో కలిసి కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. దేశ సమగ్ర అభివృద్ధిలో మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని అధికారులకు, సిబ్బందికి పిలుపునిచ్చారు. అనంతరం తన క్యాంపు కార్యాలయం, హైదర్ క్లబ్, మున్సిపల్ కార్యాలయంలో కూడా జిల్లా కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి స్వాతంత్ర్యదిన శుభాకాంక్షలు తెలిపారు.













































