మధ్యతరగతి ఫ్యామిలీ బడ్జెట్ తలకిందులు
రాష్ట్రంలో సన్న బియ్యం ధరలు సామాన్యులు, మధ్యతరగతి ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలతో సతమతమవుతున్న ప్రజలకు బియ్యం రేట్లు మరింత భారంగా మారాయి. బహిరంగ మార్కెట్‌లో సూపర్ ఫైన్ రకం బియ్యం కిలో ధర రూ.90 నుంచి రూ.95 వరకు చేరగా.. సూపర్ ఫైన్ మీడియం రకం రూ.85 నుంచి రూ.90, ఫైన్ రకం రూ.78 నుంచి రూ.80 వరకు పలుకుతున్నది. ధరలు ఇలాగే పెరిగితే సన్న బియ్యం కిలో ధర రూ. 100కు చేరడానికి ఎంతో దూరంలో లేదనే ఆందోళన వ్యక్తమవుతున్నది.
మరోవైపు.. ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు, వరి సాగు 15లక్షల ఎకరాలు తగ్గిందని, దిగుబడి గణనీయంగా తగ్గుతుందనే అంచనాల నేపథ్యంలో దీన్ని వ్యాపారులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మార్కెట్‌లో బియ్యం నిల్వలు తగ్గుతున్నాయనే ప్రచారం ధరల పెరుగుదలకు మరింత ఆజ్యం పోస్తున్నది. ఇదే అదునుగా ఎల్‌నినో బూచి చూపి ఇష్టారాజ్యంగా ధరల పెంచుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అయితే, కొత్తబియ్యం వచ్చే వరకు ఈ సమస్య తప్పదని ఎక్స్పర్ట్స్ అంటున్నరు.తలకిందులవుతున్న బడ్జెట్ సన్న బియ్యం ధరలు గత వారం రోజులుగా పెరుగుతున్నాయి. ఇటీవల 25 కిలోల బియ్యం బ్యాగ్ ధర రూ.2 వేలుగా ఉండగా.. బుధవారం నాటికి రూ.2,450కు చేరినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. హోల్సేల్ మార్కెట్లోనూ క్వింటాల్ బియ్యంపై సుమారు రూ.1,200 వరకు పెరుగుదల కనిపిస్తున్నది. హెచ్ఎంటీ, బీపీటీ, ఆర్ఎన్ఆర్ (తెలంగాణ సోనా) వంటి సన్న రకాలతోపాటు ప్రీమియం రకాల ధరలు ఎగబాకుతున్నాయి.
రిటైల్ మార్కెట్లో ప్రస్తుతం ఫైన్ రకం బియ్యం కిలో రూ.80కి పైగా ధరలు వరకు అమ్ముతున్నట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. నాణ్యత, బ్రాండ్, పాలిషింగ్, ప్యాకింగ్ను బట్టి ధరల్లో వ్యత్యాసం ఉంటున్నది. జై శ్రీరామ్ వంటి ప్రీమియం రకాల ధరలు మరింత ఎక్కువగా ఉన్నాయి. దీంతో నెలనెలా బియ్యం కొనుగోలు చేసే మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్ తలకిందులవుతున్నది.
మూడు నెలల్లో రూ.3 వేలు హైక్
సన్న బియ్యం ధరలు జూలై నుంచి క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా ప్రీమియం రకం జై శ్రీరామ్ ధరలో భారీ మార్పు కనిపిస్తున్నది. జూన్లో క్వింటాల్ ధర రూ.5,600 నుంచి రూ.6,300 మధ్య ఉండగా.. ఆగస్టు నాటికి రూ.6,300కు చేరింది. అక్టోబర్లో నాణ్యత, బ్రాండ్ను బట్టి రూ.8,400 నుంచి రూ.9,200 వరకు పలుకుతున్నది. అంటే మూడు నెలల్లోనే క్వింటాల్పై దాదాపు రూ.3 వేల వరకు పెరిగింది.
హెచ్ఎంటీ, బీపీటీ, ఆర్ఎన్ఆర్ వంటి రకాల ధరలు భారీగా పెరిగాయి. జూన్లో క్వింటాల్ రూ.4,600 నుంచి రూ.5,500 మధ్య ఉన్న కొన్ని రకాల ధరలు ప్రస్తుతం రూ.7 వేల నుంచి రూ.8 వేల వరకు పలుకుతున్నాయి. కొన్ని ప్రీమియం రకాల ధరలు రూ.9 వేల మార్కును దాటాయి.
కృత్రిమ కొరత !
బియ్యం ధరల పెరుగుదలకు వ్యాపారులు ఎల్నినో ప్రభావం, వర్షపాతం లోటు, సాగునీటి కొరత, వరిసాగుపై అనిశ్చితి కారణాలుగా చూపుతున్నారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులతో పంటల సాగు విస్తీర్ణం తగ్గడం, సన్న వడ్ల దిగుబడులు తగ్గి, భవిష్యత్తులో బియ్యం కొరత ఏర్పడుతుందనే ప్రచారం ధరలపై ప్రభావం చూపుతున్నది.
మరోవైపు.. పాత ధాన్యం నిల్వలు తగ్గడం, కొత్త ధాన్యం పూర్తిగా మార్కెట్కు చేరకపోవడం కూడా ధరల పెరుగుదలకు కారణం అంటున్నారు. కొత్త ధాన్యాన్ని మిల్లింగ్ చేసిన వెంటనే సరఫరా చేయకపోవడంతో వ్యాపారులు జిమ్మిక్కులకు పాల్పడుతున్నారని, బియ్యం నిల్వలను పెంచుకుంటూ కృత్రిమ కొరత సృష్టిస్తున్నారన్న ప్రచారం జరుగుతుంది.
ప్రీమియం రకాలపై కన్ను
నగరాలు, పట్టణాల్లో సన్నగా ఉండి, వండినప్పుడు గింజ నాణ్యతగా కనిపించే బియ్యానికి ఎక్కువ డిమాండ్ ఉంది. దీంతో జై శ్రీరామ్ వంటి ప్రీమియం రకాల ధరలను వ్యాపారులు భారీగా పెంచుతున్నారు. సాధారణ సన్న బియ్యం ధరలు పెరగడంతో తక్కువ ధరకు లభించే ప్రత్యామ్నాయ రకాల కోసం వినియోగదారులు వెతుకుతున్నారు.
బహిరంగ మార్కెట్‌లో ధరల ఎక్కువ మొత్తంలో బియ్యం వినియోగించే కుటుంబాలు, హాస్టళ్లు, చిన్న హోటళ్లు, మెస్‌లపై భారం పడుతుంది. కొందరు హోల్, మెస్ల నిర్వాహకులు రేట్లు పెంచడం ద్వారా ఈ అదనపు భారాన్ని వినియోగదారులపై మోపే అవకాశం ఉంది. మార్కెట్‌లో సరఫరాలను సమీక్షించి అక్రమ నిల్వలపై తనిఖీలు చేపట్టాలని, ధరల పెరుగుదలకు అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వాన్ని ప్రజలు కోరుతున్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip: