ఎన్డీఏ ప్రభుత్వం రైతులకు అన్ని విధాల అండగా ఉంటుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. నాయుడుపాలెంలోని క్యాంప్ కార్యాలయంలో సోమవారం సంయుక్త కిసాన్ మోర్చా రైతు సంఘం ప్రతినిధులు మంత్రిని కలిసి తమ సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీ డిమాండ్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తాం. వెలుగొండ ప్రాజెక్టు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పూర్తిస్థాయిలో రైతులకు అందజేసి ప్రాజెక్టును మేమే పూర్తి చేస్తాం. గుండ్లకమ్మ పెండింగ్ పనులు పూర్తి చేస్తాం. కరువు పీడిత ప్రాంతమైన ప్రకాశం జిల్లాను అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు అన్ని పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు.
