బిసి యాక్షన్ ప్లాన్ 2024-25 పరిధిలో ఓబిఎంఎంఎస్ స్వయం ఉపాధి పథకం కింద బ్యాంకులకు కేటాయించిన రుణాల మంజూరు లక్ష్యాలను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా, బ్యాంకర్లను ఆదేశించారు.
మంగళవారం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా బ్యాక్వర్డ్ క్లాసెస్ సర్వీస్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో బిసి యాక్షన్ ప్లాన్ 2024-25 కింద ఓబిఎంఎంఎస్ స్వయం ఉపాధి పథకం అమలుపై ప్రత్యేక జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బిసి యాక్షన్ ప్లాన్ 2024-25 కింద ఓబిఎంఎంఎస్ స్వయం ఉపాధి పథకంలో భాగంగా పేద కుటుంబాలు ఆర్థికాభివృద్ధి సాధించేలా జిల్లాకు 1,195 యూనిట్లు, అలాగే ఆర్ధికంగా వెనుకబడిన కులాలకు (ఈడబ్ల్యూఎస్) సంబంధించి ఓబిఎంఎంఎస్ స్వయం ఉపాధి పథకం కింద జిల్లాకు 483 యూనిట్లు మంజూరు కావడం జరిగిందన్నారు. అలాగే నిరుద్యోగ యువకులకు రాష్ట్ర ప్రభుత్వం జనరిక్ మెడికల్ షాపులను ఏర్పాటు చేయడం జరుగుతోందని, యూనిట్ కాస్ట్ 8 లక్షల రూపాయలు ఉండగా, సబ్సిడీ 4 లక్షల రూపాయలు, బ్యాంకు రుణం 4 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుందన్నారు. జిల్లాకు సంబంధించి బిసి యాక్షన్ ప్లాన్ కింద 24 జనరిక్ మెడికల్ షాప్ లు, ఆర్ధికంగా వెనుకబడిన కులాలకు సంబంధించి ఈడబ్ల్యూఎస్ యాక్షన్ ప్లాన్ కింద 85 జనరిక్ మెడికల్ షాప్ లు మంజూరు కావడం జరిగిందని, అర్హత కలిగిన బిసి, ఈబీసీ నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. జనరిక్ మెడికల్ షాప్ ల ఏర్పాటుపై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలో 13 బ్యాంకుల పరిధిలో యూనిట్ ల కింద అర్హులైన లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. బ్యాంకు వారీగా, బ్రాంచ్ వారీగా లక్ష్యాలను నిర్దేశించడం జరిగిందన్నారు. చిత్తశుద్ధితో పనిచేసి ఆయా బ్యాంకులకు కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్, బ్యాంకర్లను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా బ్యాంకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించి అర్హత కలిగిన ప్రతి లబ్దిదారునికి రుణాలు మంజూరు చేసేలా బ్యాంకర్లు కృషి చేసి జిల్లాను మొదటి స్థానంలో నిలపాలన్నారు. ఈనెల 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఆన్లైన్లో సైట్ ఓపెన్ కావడం జరుగుతుందని, మీసేవ, సచివాలయంలో అర్హులైన లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
సమావేశంలో బిసి కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వర రావు, ఎల్.డి.ఎం రమేష్, బ్యాంకర్లు, తదితరులు పాల్గొన్నారు.



