హైదరాబాద్ సెప్టెంబర్ 21,(జే ఎస్ డి ఎం న్యూస్) :
దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావును తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షులు ముప్పిడి గోపాల్ ఆధ్వర్యంలో ప్రతినిధులు దర్గా రవికుమార్, శ్రీనివాసాచారి తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, 2012 ఏప్రిల్ 18న నిబంధనల ప్రకారం అనుమతి తీసుకుని బాలం రాయి దండు మారమ్మ ఆలయం లో నిర్మించిన మండపం పనులు పూర్తయిన తర్వాత క్షేత్రస్థాయిలో తీవ్ర సమస్యలు తలెత్తాయని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. మండపానికి సంబంధించి తూర్పు, ఉత్తరం, పశ్చిమ దిశల్లో రెండేసి మెట్ల ఎత్తున ఫ్లోరింగ్ వేసి మార్గాలను మూసివేశారని, అదేవిధంగా సోమసూత్రాన్ని సైతం మూసివేయడం జరిగిందని వారు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా వేసిన ఆ అదనపు ఫ్లోరింగ్ మెట్లను, మూసివేసిన సోమసూత్రాన్ని వెంటనే తొలగించి పూర్వస్థితికి తీసుకురావాలని ఈ సందర్భంగా వినతిపత్రం సమర్పించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కమిషనర్ హనుమంతరావు, తక్షణమే ఇంజనీరింగ్ అధికారులను క్షేత్రస్థాయి పరిశీలనకు పంపించి తగిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చినట్లు ముప్పిడి గోపాల్ తెలియ జేశారు.
