మెరుగైన జీవనోపాధి కోసం ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు. బిసి కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఒంగోలులోని డాన్ బోస్కో ఐటిఐ సెంటర్లో మహిళలకు ఇస్తున్న టైలరింగ్ శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం ఆమె పరిశీలించారు. ఈ కేంద్రంలో శిక్షణ తీసుకుంటున్న మహిళతో ఈ సందర్భంగా కలెక్టర్ స్వయంగా మాట్లాడారు. వారి కుటుంబ నేపథ్యాన్ని అడిగి తెలుసుకున్నారు. మహిళలు కూడా ఆర్థికంగా సాధికారత సాధించాలని, స్వశక్తితో ఎదగాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ చెప్పారు. ఈ దిశగానే పలు పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా 31 సెంటర్లలో టైలరింగ్ శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. మూడు నెలల పాటు జరిగే ఈ ట్రైనింగులో ప్రస్తుతం 4233 మంది శిక్షణ తీసుకుంటున్నట్లు తెలిపారు. అర్హులందరూ ఇలాంటి శిక్షణ కార్యక్రమాలను వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ వెంట జిల్లా బిసి కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం. వెంకటేశ్వరరావు, ఇతర అధికారులు ఉన్నారు.


