జర్నలిస్ట్… ఓ నిత్య విద్యార్థి-చదవడం, రాయడంతోనే భాషపై పట్టు – విషయ పరిజ్ఞానంతోనే సమగ్ర వార్తలు సాధ్యం – విభిన్నమైన వార్తలతో పాటకులలో ఆదరణ సాధ్యం

పాత్రికేయ వృత్తిలో ప్రతిఒక్కరూ నిత్య విద్యార్థిగా ఉంటూ ఎప్పటికప్పుడు కొత్త విషయాలపై అవగాహన పెంచుకోవడం అవసరమని సి.రాఘవాచారి మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేశ్ కుమార్ తెలిపారు. బాపట్లలోని సూర్యలంక బీచ్, సీ కోస్ట్ సన్నీ రిసార్ట్ నందు జేబీ శ్రీధర్ ప్రాంగణం వేదికగా విశాలాంధ్ర జాతీయ దినపత్రిక, విజయవాడ ఎడిషన్ పరిధిలోని 11 జిల్లాల నియోజకవర్గ స్థాయి విలేకరుల శిక్షణ శిబిరం మంగళవారం ప్రారంభమైంది. తొలుత ప్రజా నాట్యమండలి కళాకారులు ఆరేటి రామారావు, బి.రామకృష్ణ విప్లవ గీతాలతో అలరించారు. విశాలాంధ్ర ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ కూన అజయ్ బాబు సభకు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా ఆలపాటి సురేష్ కుమార్ తో పాటు సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు, విశాలాంధ్ర జనరల్ మేనేజర్ పి.హరినాథ్ రెడ్డి హాజరయ్యారు. తొలుత ఆలపాటి సురేష్ కుమార్ మాట్లాడుతూ… పత్రిక రంగంలో నైతిక విలువలను జోడిస్తూ, ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా వార్తలు రాయాలని అన్నారు. ఆధునిక కాలంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాపై సోషల్, డిజిటల్ మీడియాల ప్రభావం ఉందని, దీనిని అధిగమించాలంటే ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా నైపుణ్యతలు పెంచుకోవాలని సూచించారు. పౌరుల హక్కులకు భంగం కలగకుండా సమాజ శ్రేయస్సు కోసం పాత్రికేయులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పనిచేస్తున్న పత్రికలతో పాటు ఇతర పత్రికలలోని కథనాలను కూడా చదవడం ద్వారా విషయ పరిజ్ఞానం, ఇతరుల ధోరణుల పై అవగాహన వస్తుందని సురేష్ కుమార్ హితవు పలికారు. జల్లి విల్సన్ మాట్లాడుతూ ..పత్రికా రంగంలో విశాలాంధ్ర ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని 73 వసంతాలు పూర్తి చేసుకోవడం హర్షించదగ్గ విషయమన్నారు.
విశాలాంధ్ర పత్రిక అభ్యున్నతికి కృషి చేస్తున్న విలేకరులకు అభినందనలు తెలిపారు. శిక్షణా తరగతులు సద్వినియోగం చేసుకొని రాబోయే కాలంలో మంచి కథనాలకు నాంది పలకాలని అభిలాషించారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు మాట్లాడుతూ …నేటి పోటీ ప్రపంచంలో పత్రికా రంగం కత్తిమీద సాములా మారిందని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పని చేయడంలో సంతృప్తి ఉంటుందన్నారు. ప్రధానంగా క్రైమ్, రాజకీయ, మానవీయ కోణంలో రాసే కథనాలకు ప్రజాదరణ లభిస్తుందని తెలిపారు. ఘటన స్థలాలకు స్వయంగా వెళితే సమగ్రంగా వార్తలు రాయగలరని సూచించారు. విషయ పరిజ్ఞానం పెంచుకుంటే మంచి ఫలితాలు సాధించవచ్చని అన్నారు. మంచి కథనాల ద్వారా ఇటు యాజమాన్యం అటు ప్రజల మన్ననలు పొందవచ్చన్నారు. విలేకరుల హెల్త్ కార్డ్స్, ఇన్సూరెన్స్, అక్రిడేషన్స్ పై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి యూనియన్ అందుకు చేస్తున్న కృషి గురించి వివరించారు. క్షేత్ర స్థాయిలో విలేకరులు పర్యటిస్తే విభిన్నమైన కథనాలు లభిస్తాయని చెప్పారు. ప్రస్తుత సోషల్ మీడియాలో విభిన్నమైన కథనాలు ప్రింట్ మీడియా అందిస్తేనే ఆదరణ ఉంటుందని తెలిపారు. అందుకు జర్నలిస్టులు చేయాల్సిన కృషిని వివరించారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన బాపట్ల జిల్లాలో విశాలాంధ్ర విలేకరుల శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేయటం హర్షణీయమన్నారు. పార్టీ తరపున పాత్రికేయులకు సహాయ సహకారాలను అందిస్తామన్నారు. కార్యక్రమంలో విశాలాంధ్ర బాపట్ల జిల్లా బ్యూరో కాగిత ప్రశాంత్ రాజు, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి ఎ.సురేశ్, కార్యవర్గ సభ్యుడు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *