పోరాటాల పురిటిగడ్డ అయిన ఒంగోలులో కమ్యూనిస్టులు కదం తొక్కారు. ఒంగోలు నగరమంతా ఎర్రజెండాలతో ఎరుపెక్కింది. రాష్ట్రం నలుమూలల నుంచి సీపీఐ శ్రేణులు వేలాది మంది ఒంగోలు తరలివచ్చారు. ఎర్రజెండా చేతపట్టి ఒంగోలులో భారీ ప్రదర్శన నిర్వహించారు. ప్రజా నాట్యమండలి ఆధ్వర్యంలో కళాకారులు వివిధ వేషధారణలతో మహా ప్రదర్శన అగ్రభాగాన ప్రదర్శనలు చేస్తూ ఉత్సాహ భరిత వాతావరణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతూ నినదించారు. సీపీఐ 28వ రాష్ట్ర మహాసభలు శనివారం సాయంత్రం ప్రారంభించారు. స్థానిక నెల్లూరు బస్టాండ్లోని మునిసిపల్ హైస్కూల్ నుంచి కలెక్టరేట్, ట్రంక్ రోడ్డు,
బాపూజీ కాంప్లెక్స్ అద్దంకి బస్టాండ్ ఆర్టీసి బస్టాండ్ మీదుగా కొత్త కూరగాయల మార్కెట్ సమీపంలోని మునిసిపల్ గ్రౌండ్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. ర్యాలీ అగ్రభాగాన సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ, ఎఐకెఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య, జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, సహాయ కార్యదర్శులు ముప్పాళ్ల నాగేశ్వరరావు. జేవీవీ సత్యనారాయణ మూర్తి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య నడిచారు. ర్యాలీ ప్రారంభం నుంచి సీపీఐ అభిమానులు ప్రధాన కూడళ్లలో సీపీఐ అభిమానులు, సానుభూతి పరులు అగ్రనేతలపైన పూలవర్షం కురిపించారు. రెండు కిలోమీటర్ల మేర ర్యాలీ కొనసాగుతూ ముందుకు సాగింది. ప్రజా నాట్యమండలి కళాకారులు వివిధ వేషధారణలలో ర్యాలీ అగ్ర భాగాన ప్రదర్శించారు. శ్రీకాకుళం జిల్లా నుంచి
కళాకారులు ప్రదర్శిస్తున్న నృత్య రూపాలు చూపరులను అమితంగా ఆకట్టుకున్నాయి. నెల్లూరు. బస్టాండ్ నుండి ఆర్టీసి బస్టాండ్ వరకు ర్యాలీ క్రమశిక్షలుగా రెడ్షర్ట్ వలంటీర్లు జెండాలు చేతబూనగా, మహిళలు ఎర్రటి చీరలు ధరించి ర్యాలీలు అగ్రభాగాన నిలిచారు. కొంతమంది మహిళలు గొడుగుపై సీపీఐ గుర్తులతో తయారు చేయించిన గొడుగులతో ర్యాలీలో పాల్గొనగా ర్యాలీకే వన్నె తెచ్చాయి. శ్రీకాకుళం ప్రాంతంలోని గిరిజనుల వేషధారణ నృత్యాలు ర్యాలీలో ఆకట్టుకున్నాయి. డప్పుల నృత్యంతో పాటు భగత్ సింగ్, అంబేడ్కర్, అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోష్ నేతల వేషధారణలతో చిన్నారులు ర్యాలీలో పాల్గొన్నారు. వీరిని సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ దగ్గరకు తీసుకొని అభినందించారు. మరోపక్క లెనిన్ వేషధారణలో ర్యాలీలో ముందుకు సాగిన వ్యక్తిపై అందరిచూపు పడింది. మొట్టమొదటి సారి రాష్ట్ర మహాసభ జరుపుకుంటున్న ఒంగోలులో గతంలో ఎన్నడూ జరగని విధంగా ర్యాలీ నిర్వహించారు. ఎర్రదండు అంతా కదిలి ఒంగోలులోనే కదం తొక్కినట్లు ఒంగోలు ప్రాంతమంతా ఎరుపెక్కింది. ఇతర రాజకీయ పార్టీల నేతలు, ప్రజా సంఘాల నాయకుల దృష్టి అంతా సీపీఐ మహా ప్రదర్శనపై దృష్టి మల్లే విధంగా ప్రదర్శన నిర్వహించడం అందరూ విశేషంగా చెప్పుకున్నారు. అనంతరం
కొత్త కూరగాయల మార్కెట్ సమీపం లోని మునిసిపల్ స్థలంలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ
పాల్గొన్నారు. సభకు ముందు సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డికి సభ ఘనమైన నివాళులు అర్పించింది. కార్యదర్శి , కార్యవర్గ సభ్యులతో పాటు వివిధ జిల్లాల కార్యదర్శులు సుధాకర్ రెడ్డి చిత్రపటానికి పుష్పాలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వ పాలనలో ప్రజాస్వామ్యానికే పెనుప్రమాదం పొంచివుండని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు దోచి పెడుతూ పార్లమెంట్ లో ప్రజల హక్కులను కూడా తాలరాసే విధంగా ఎన్డీఏ నేతలు వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. అమెరికా అధ్యక్షులు ట్రంప్ పదేపదే భారతదేశాన్ని బ్లాక్మెయిల్ చేస్తుంటే మోడీ ఎందుకు ఎదిరించడం లేదని ప్రశ్నించారు. పక్కనున్న చైనా దేశం ట్రంప్ మాటలకు వ్యతిరేకంగా బదులిస్తుంటే భారత ప్రధాని మాత్రం ట్రంప్ కు భయపడి వ్యవహరించడం దేనికి సంకేతం ఇస్తుందని అన్నారు. మరోపక్క ఆపరేషన్ కగాన్ పేరుతో నక్సలైట్లను వేరివేయడం, అమాయకులైన గిరిజనులను మట్టికరిపించడం ఏమిటని ప్రశ్నించారు. నక్సలెట్లను అయితే చంపగలరేమో కానీ నక్సలిజాన్ని మాత్రం చంప లేరని పేర్కొన్నారు. ఈ దేశంలో అసమానతలు, పేదరికం అంటరానితనం ఉన్నంతకాలం నక్సలిజం, ఎర్రజెండా, కమ్యూనిజం ఉంటుందన్ హెచ్చరించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ ….రాష్ట్రంలో అధికార ప్రతిపక్షాల నేతలు మోది భజన చేస్తున్నారని పేర్కొన్నారు. కేంద్రంలో రాష్ట్రంలో డబల్ ఇంజన్ సర్కారు ఉందని చెబుతున్న చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ఏం సాధించారని ప్రశ్నించారు. గడిచిన ఏడాదిలో ఒక లక్షా 70 వేల కోట్లు. అప్పులు మాత్రం చేశారని అన్నారు. విశాఖ ఉక్కు
ఆంధ్రుల హక్కు పేరుతో సాదించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పూనుకంటే దానిపై ఆపదానికి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి భయపడుతున్నారని తెలిపారు. మరోపక్క విభజన చట్టంలో ఏ ఒక్క హామీని అమలు చేయలేదని అన్నారు. దీనికి తోడు ఈ రాష్ట్రంలో మూడు పంటలు పండించే భూములను ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టేందుకు. చంద్రబాబు నాయుడు పూసుకున్నారని అన్నారు. పలాస, కరేడు భూములతో పాటు అమరావతిలో కూడా మరో 30 వేల ఎకరాలు భూ సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుందని తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కమ్యూనిస్టు పార్టీ నిరంతరం పోరాడుతుందని హెచ్చరించారు. వేదికపై సీపీఐ కార్యదర్శి వర్గ సభ్యులు ఈశ్వరయ్య అందరినీ ఆహ్వానించగా ఈ కార్యక్రమంలో అఖిల భారత కిసాన్ సభ జాతీయ ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ, రాష్ట్ర సహాయ కార్యదర్శులు ముప్పాల నాగేశ్వరరావు, కె వి వి సత్యనారాయణమూర్తి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ జల్లి విలన్, పి హరినాథ్ రెడ్డి, ఓబులేసు, పి రామచంద్రయ్య ,జగదీష్ కే వి బి ప్రసాద్, జంగాల అజయ్ కుమార్, డేగ ప్రభారర్, అహ్వాన సంఘం గౌరవ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ పి కె చంద్రశేఖర్, ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్ నారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,
ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న కళారూపాలు….
ఈ సందర్భంగా ఏపీ ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చండ్రా నాయక్, చిన్నం
పెంచలయ్య రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి ఆర్ రామకృష్ణ, కోశాధికారి పిచ్చయ్య, గుర్రప్ప, నజీర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కళారూపాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రధానంగా చిన్నారుల నృత్య రూపకాలు, కళాకారుల పాటలు, కోలాటాలు, చప్పు నృత్యాలు, జానపద కళారూపాలు, ఎర్రజెండా పాటలు ప్రజలను చైతన్య పరస్తూ, ఆలోచనలు రేకేత్తిస్తూ, ఉర్రూతలూగించాయి. కళాకారులు నిర్వహించిన ఆట పాట, మాట ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచేలా. చెరగని ముద్రలు వేసేలా కళారూపాలు ప్రదర్శించారు.




