హైదరాబాద్, జూన్ :(జె ఎస్ డి ఎం న్యూస్) : జిల్లాలో నీట్ (యూజీ)–2026 పరీక్షను అత్యంత ప్రశాంత వాతావరణంలో నిర్వహించినట్లు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా తెలిపారు. ఆదివారం బేగంపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన నీట్ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి, పరీక్ష నిర్వహణ ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రంలోని భద్రతా ఏర్పాట్లు, స్ట్రాంగ్ రూమ్, మిగిలిన పరీక్షా సామగ్రి భద్రపరిచే విధానాన్ని ఆమె తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రం వద్ద పోలీస్, సీఆర్‌పీఎఫ్ సిబ్బంది చేపట్టిన భద్రతా చర్యలను పరిశీలించిన కలెక్టర్, పరీక్ష ముగిసేవరకు నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు.
కేంద్రంలో అభ్యర్థుల కోసం కల్పించిన మౌలిక సదుపాయాలైన తాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా, పారిశుధ్యం, ప్రథమ చికిత్స సదుపాయాలను కలెక్టర్ పరిశీలించారు. బయోమెట్రిక్ విధానం, తరగతి గదుల్లో వెంటిలేషన్, జామర్లు, సీసీటీవీ నిఘా వ్యవస్థను ఆమె తనిఖీ చేశారు. బేగంపేట కేంద్రంలో మొత్తం 960 మంది అభ్యర్థులకు గాను, వింగ్–ఏలో 720 మందిలో 70 మంది, వింగ్–బీలో 240 మందిలో 36 మంది గైర్హాజరైనట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) జారీ చేసిన మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేస్తూ పరీక్షను పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 27,954 మంది అభ్యర్థులకు గాను 24,973 మంది పరీక్షకు హాజరయ్యారని, 2,981 మంది గైర్హాజరయ్యారని, మొత్తం 89.34 శాతం హాజరు నమోదైందని కలెక్టర్ వెల్లడించారు. ఈ తనిఖీలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పద్మావతి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సంధ్య, సెంటర్ అబ్జర్వర్ డాక్టర్ కిషన్, నోడల్ అధికారి పాల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

