కేంద్ర ప్రభుత్వ పథకాలను వినియోగించుకుని జిల్లాను అభివృద్ధి చేయడానికి అధికారులు మరింత దృష్టి సారించాలి – ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి

కేంద్ర ప్రభుత్వ పథకాలను వినియోగించుకుని జిల్లాను అభివృద్ధి చేయడానికి అధికారులు మరింత దృష్టి సారించాలని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఆయన అధ్యక్షతన ప్రకాశం భవనంలో ‘ దిశా ‘ సమావేశం జరిగింది. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్ధన రావు, .బి.ఎన్.విజయ్ కుమార్, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ప్రకాశం, మార్కాపురం జిల్లాల జాయింట్ కలెక్టర్లు కల్పనా కుమారి, పులి శ్రీనివాసులు ఇందులో పాల్గొన్నారు.
ఉపాధి హామీ, జల జీవన్ మిషన్, వ్యవసాయ, విద్యుత్, విద్య, పబ్లిక్ హెల్త్, జాతీయ రహదారులు, బిఎస్ఎన్ఎల్, తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. జిల్లాలోని పరిస్థితులను పరిగణలోకి తీసుకొని అవసరమైన ప్రతిపాదనలు, నివేదికలను ప్రభుత్వానికి సమర్పించడం ద్వారా నిధులను సమర్ధంగా వినియోగించుకోవాలని ఎంపీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
మంత్రి స్వామి మాట్లాడుతూ జరుగుమల్లి నుంచి 16వ నెంబర్ రహదారిలోకి ప్రవేశించే ప్రదేశంలో ప్రమాదాలను నివారించేందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఏర్పాటుకు పరిశీలించి కేంద్రానికి ప్రతిపాదనలు పంపించాలని అధికారులకు సూచించారు. సాంకేతిక సమస్యలు ఉంటే సంబంధిత శాఖలు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని మంత్రి చెప్పారు. రామతీర్థం నుంచి నీటి సరఫరాలో ఎదురయ్యే సమస్యలపై తక్షణమే దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఒంగోలు ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇతర నియోజకవర్గాలలో ఉపాధి హామీ పథకంలో మ్యాజిక్ డ్రైనేజీల పనులలో పురోగతి ఉందని, ఒంగోలు నియోజకవర్గంలో కూడా పనులను వేగవంతం చేయాలని అధికారులకు చెప్పారు. మేదరమెట్ల వద్ద ఉన్న మంచినీటి పథకం నుంచి ఒంగోలు నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలకు కూడా మంచినీటి సదుపాయం ఉన్నందున వాటి పైపుల మరమ్మతులు, కొత్త వాటిని ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. కొత్తపట్నంలో జలజీవన్ మిషన్ పథకం కింద పనులను కూడా వేగవంతం చేయాలని అన్నారు. ఒంగోలు నగరంలోని కిమ్స్ ఆసుపత్రి వద్ద, దసరాజు
పల్లికి వెళ్లే మార్గం వద్ద జాతీయ రహదారిలోకి ప్రవేశించే సర్వీస్ రోడ్ల మరమ్మతులపై దృష్టి సారించాలని అధికారులకు చెప్పారు.
సంతనూతలపాడు ఎమ్మెల్యే మాట్లాడుతూ తన నియోజకవర్గంలో ఉపాధి హామీ కూలీలకు పూర్తిస్థాయిలో వేతనాల చెల్లింపు జరగలేదని, త్వరగా చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏడుకొండలపాడు వద్ద జాతీయ రహదారిపై డ్రైనేజీ సరిగ్గా లేకపోవడం వలన వర్షపు నీరు నిలిచిపోతోందని, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పారు.
కనిగిరి ఎమ్మెల్యే మాట్లాడుతూ తన నియోజకవర్గంలోని డీజీ పేట వద్ద తాగునీటి కాలువకు జాతీయ రహదారి అడ్డుగా వస్తుందని అన్నారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా వీటిపై దృష్టి సారించి ముందుగానే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
పలువురు జడ్పిటిసిలు, ఎంపీపీలు మాట్లాడుతూ జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని, అవసరమైన చోట విద్యుత్ దీపాలకు మరమ్మతులు / కొత్తవి ఏర్పాటు చేయడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఉపాధి హామీ పథకం కింద పొలాలకు వెళ్లే డొంక రోడ్లను ఇది చేయాలని అధికార దృష్టికి తెచ్చారు. తాళ్లూరు జెడ్పిటిసి మారం వెంకటరెడ్డి మాట్లాడుతూ.. మద్దిపాడు వెల్లంపల్లి మధ్యలో నేషనల్ హైవే రహదారిలో క్రాసింగ్ కు అవకాశం లేకపోవడంతో గుళ్ళ పల్లి వద్ద వరకు వెళ్లి వెనక్కి రావలసి వస్తుందని చెప్పారు. దీంతో అనేకమంది వెల్లంపల్లి నుండి మద్దిపాడు వరకు ఆపోజిట్ హైవేలో వస్తు ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు దీన్ని దృష్టిలో ఉంచుకొని వెల్లంపల్లి వద్ద అండర్ పాస్ ఇవ్వాల్సిందిగా కోరారు. ప్రజా ప్రతినిధులు ప్రస్తావించిన సమస్యలపై సంబంధిత అధికారులు సమాధానం ఇచ్చారు. శాఖాపరంగా తీసుకుంటున్న చర్యలను వివరించారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు ప్రస్తావించిన సమస్యలపై మరింత దృష్టి సారించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు, దిశా కమిటీ నామినేటెడ్ సభ్యులు కె. శ్రీనివాసరావు, బి.మార్క్ పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *