భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఒంగోలు నగరం సర్వాంగ సుందరంగా సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న ముమ్మర ఏర్పాట్లను గురువారం జిల్లా కలెక్టర్ పి. రాజా బాబు, జిల్లా ఎస్.పి హర్షవర్ధన్ రాజు కలసి క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించారు. వేడుకల ప్రాంగణంలో పందాల్స్ నిర్మాణం, వేదిక అలంకరణ, పరేడ్ మార్చ్ ఫాస్ట్ ప్రాక్టీస్, మైక్ సిస్టమ్ మరియు విఐపి, సాధారణ ప్రజల కూర్చునే ప్రాంతాలను వారు నిశితంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… జాతీయ పండుగను జిల్లా ప్రజలందరూ గర్వించేలా, అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వేడుకలకు విచ్చేసే ప్రజాప్రతినిధులు, అధికారులు, విలేకరులు, స్వాతంత్ర్య సమరయోధులు, విద్యార్థులు మరియు సాధారణ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా ప్రాంగణంలో తాగునీటి సదుపాయం, ప్రాథమిక వైద్య సదుపాయాలు నిరంతరం అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.
జిల్లా ఎస్.పి హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ… పరేడ్ గ్రౌండ్ వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ట్రాఫిక్ మళ్లింపులు, వాహనాల పార్కింగ్ స్థలాల కేటాయింపును క్రమబద్ధీకరించామని, ప్రోటోకాల్ ప్రకారం సీటింగ్ అమరికలను పూర్తి చేశామని పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఎక్కడా చిన్నపాటి లోటుపాట్లకు కూడా తావులేకుండా వేడుకలను విజయవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ పరిశీలన కార్యక్రమంలో డి.ఆర్. ఓ వెంకట రమణ, జిల్లా స్థాయి అధికారులు, పోలీస్ ఉన్నతాధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం నూతన పోలీస్ కార్యాలయ భవనాన్ని జిల్లా కలెక్టర్ పి రాజబాబు ఎస్పీ హర్షవర్ధన్ రాజు కలిసి పరిశీలించారు.


