రాంగోపాల్ పేట సెప్టెంబర్ 19,(జే ఎస్ డి ఎం న్యూస్) :
సామాజిక మాధ్యమాల్లో తక్కువ ధరకు దుస్తులంటూ వచ్చే ఆకర్షణీయమైన ప్రకటనలను నమ్మి ఓ ప్రైవేట్ ఉద్యోగిని మోసపోయింది. రాణిగంజ్‌లోని వెంకటలక్ష్మి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌లో ఉంటున్న వైనవోయినల గోవిందమ్మ (26) ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తుండగా ‘కవి ఫ్యాషన్ డిజైనర్’ పేరిట రూ. 300కే డ్రెస్ లభిస్తుందన్న ప్రకటన కనిపించింది. అందులోని లింక్‌పై క్లిక్ చేయగా వాట్సాప్ నంబర్‌కు రీడైరెక్ట్ అయింది. ఆ నంబర్‌ను సంప్రదించిన బాధితురాలు రెండు దుస్తులను ఎంపిక చేసుకుని, చెప్పిన క్యూఆర్ కోడ్‌కు యూపీఐ ద్వారా మొదట రూ. 600 చెల్లించింది. కాసేపటికే డెలివరీ ఛార్జీలు, జీఎస్టీ బిల్లులంటూ విడతలవారీగా డబ్బులు డిమాండ్ చేసిన కేటుగాళ్లు, ఆ మొత్తాన్ని తిరిగి రీఫండ్ చేస్తామని నమ్మబలికారు. నగదు వెనక్కి వస్తుందన్న ఆశతో బాధితురాలు మొత్తం 22 లావాదేవీల్లో ఏకంగా రూ. 38,276 చెల్లించింది. చివరగా మరో రూ. 5 వేలు డిమాండ్ చేయడంతో మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అపరిచిత ఆన్‌లైన్ ప్రకటనలను నమ్మి డబ్బులు పంపవద్దని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో డ్రెస్ ఆఫర్ల పేరిట టోకరా..యువతికి రూ. 38 వేల శఠగోపం
19
Sep