కొత్తపట్నం సముద్రతీరంలో లభించిన తమిళనాడు మత్స్యకారుల మృతదేహాలను గుర్తించేందుకు వారి కుటుంబ సభ్యులను తీసుకుని ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఎన్. మేరీ విల్సన్ గురువారం రాత్రి ఒంగోలు వచ్చారు. స్థానిక జి.జి.హెచ్. లోని మార్చురీలో ఉంచిన మృతదేహాలను ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ కమిషనర్ రమా శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ పి.రాజాబాబుతో కలిసి వారు పరిశీలించారు. పడవలో మొత్తం తొమ్మిది మంది మత్స్యకారులు ఉండగా గురువారానికి ఐదు మృతదేహాలు లభించాయి. వీటిలో నాలుగు మృతదేహాలను వారి కుటుంబ సభ్యులు గుర్తించినట్లు మంత్రి మేరీ విల్సన్ తెలిపారు. పోలీసుల విచారణ, పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను తమిళనాడు తీసుకువెళ్తామని ఆయన చెప్పారు.
కలెక్టర్ మాట్లాడుతూ కొత్తపట్నం తీరంలో బోల్తా పడిన బోటు తమిళనాడుకు చెందినదని మన ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సమాచారం వచ్చిందన్నారు. ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ఆ ప్రమాద స్థలాన్ని పరిశీలించినట్లు చెప్పారు. మిగిలిన మృతదేహాల కోసం శుక్రవారం గాలింపు చర్యలను ముమ్మరం చేస్తామన్నారు.
ఈ సందర్భంగా వారి వెంట ఒంగోలు ఆర్డిఓ చంద్రశేఖర్ నాయుడు, జిజిహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ కిరణ్, మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, ఇతర అధికారులు ఉన్నారు.



Save or share this story as a newspaper-style Epaper Clip: