దేశంలోనే అత్యంత సురక్షితమైన, శాంతి భద్రతలకు నిలయం హైదరాబాద్ నగరమని సనత్ నగర్ ఎమ్మెల్యే అభ్యర్ధి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం రాత్రి సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని రాంగోపాల్ పేట డివిజన్ లో గల PG రోడ్డులో ఉన్న ఆర్యవైశ్య భవన్ లో ఫెడరేషన్ ఆఫ్ PG రోడ్ కాలనీస్, అపార్ట్మెంట్ సొసైటీస్ ఆధ్వర్యంలో లో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశంలో గుజరాతి, జైన్, అగర్వాల్, మహేశ్వరి సమాజ్, రాజస్థాని తదితర సమాజ్ లకు చెందిన ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భాష, ప్రాంతం ఏదైనా ఇక్కడ నివసించే వారంతా తమ వారేనని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఇక్కడ స్థిరపడిన వారిలో కొందరిలో కొంత ఆందోళన ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి ఆధ్వర్యంలో తొమ్మిదిన్నర సంవత్సరాలలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుతో తెలంగాణ రాష్ట్రం గొప్ప రాష్ట్రంగా అవతరించిందన్నారు. ఎలాంటి సమస్యలు లేకుండా అన్ని రకాల వ్యాపారాలు సాఫీగా సాగుతున్నాయని తెలిపారు. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా తెలంగాణ సర్కార్ ముందుకు సాగుతుందన్నారు. 50 సంవత్సరాలలో జరగని అభివృద్దిని తాము అధికారంలోకి వచ్చిన తొమ్మిదిన్నర సంవత్సరాలలోనే చేసి చూపించామని తెలిపారు. 2014 కు ముందు PG రోడ్డు, డ్రైనేజీ వ్యవస్థ ఎంతో అద్వాన్నంగా ఉండేవని, కానీ ఇప్పుడు ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దామని వివరించారు. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో నాలా కు వచ్చే వరదతో వరద ముంపు సమస్య తీవ్రంగా ఉండేదని, నాలా అభివృద్ధి, నూతన వంతెన నిర్మాణం చేపట్టి వరదముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చేశామన్నారు. గతంలో ఇక్కడి నుండి ప్రాతినిద్యం వహించిన ముఖ్యమంత్రి, మంత్రులు కూడా చేయలేని అనేక ప్రజా సమస్యలను తాము పరిష్కరించామని పేర్కొన్నారు. నిత్యం ప్రజల మద్యనే ఉంటున్నందున ప్రజా సమస్యలపై తనకు పూర్తిస్థాయిలో అవగాహాన ఉన్నదని, ప్రజల అవసరాలను గుర్తించి అందుకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. నగరంలోని గోశాలల్లోని జీవాలకు ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా వైద్య సేవలు చేయడంతో పాటు మందులను కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. 1962 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా మొబైల్ వెటర్నరీ క్లినిక్ గోశాల వద్దకు చేరుకొని వైద్య సేవలు అందిస్తున్నట్లు వివరించారు. అభివృద్ధి కోసం పని చేస్తు, ప్రజలకు అందుబాటులో ఉంటున్న తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈనెల 30 వ తేదిన జరిగే ఎన్నికలలో అందరూ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓటర్లను అభ్యర్ధించారు. ఈ సమావేశంలో కార్పొరేటర్ టి.మహేశ్వరి, మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ గౌడ్, PG రోడ్ అద్యక్ష్దుడు ప్రవీణ్, ఉపాధ్యక్షుడు కిషోర్, సెక్రెటరీ సంజయ్, గిలానీ, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ BRS పార్టీ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, జైన్ సమాజ్ అద్యక్షుడు యోగేష్ జైన్, తివారి, నవీన్ షా, ఆనంద్ పాటిల్, జగదీశ్ వర్మ, మోతిలాల్, ఉత్తమ కుమార్ రాజ్ పురోహిత్, గులాబ్ సింగ్ రాజ్ పురోహిత్, రమేష్, సురేష్, దీపక్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
