చేతులు అదే పనిగా వణికిపోతూ ఉంటాయి. నీళ్ల గ్లాసు గానీ, కాఫీ కప్పు గానీ సరిగా పట్టుకోలేరు. అన్నం తినడం కూడా కష్టమే అవుతుంది. మాట సరిగా రాదు. అడుగులు పడటం కష్టమవుతుంది. ఇలా మన శరీరం మన అదుపులో ఉండనే ఉండదు. దీన్నే పార్కిన్సన్స్ డిసీజ్ అంటారు. నిజానికి ఎప్పుడో 4,500 ఏళ్ల క్రితం ఆయుర్వేదంలోనే దీని ప్రస్తావన ఉంది. అప్పట్లో దీన్ని కంపవాతం అనేవారు. కంపం అంటే వణుకు, వాతం అంటే కండరాల సమస్య. అప్పట్లో దీనికి వెల్వెట్ బీన్ మొక్కతో చికిత్స చేసేవారు.
ఆ మొక్కనుంచే లెవోడోపా అనే మందును ఆ తర్వాత అభివృద్ధి చేశారు. దాన్నే ఇప్పుడు పార్కిన్సన్స్ డిసీజ్ చికిత్సలో ఉపయోగిస్తున్నాం అని కిమ్స్ ఆస్పత్రికి చెందిన ప్రముఖ పారిసన్స్ స్పెషలిస్ట్ డాక్టర్. జయశ్రీ అన్నారు.
అంతర్జాతీయ పార్కిన్సన్స్ డే సందర్భంగా నగరంలోని కిమ్స్ ఆస్పత్రిలో గురువారం జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కిమ్స్ ఆస్పత్రి సీఎండీ డాక్టర్ బొల్లినేని భాస్కరరావు, ఆస్పత్రికి చెందిన ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ సీతాజయలక్ష్మి, ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ మానస్ పాణిగ్రాహి, డా. మోహన్ దాస్, డా. ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమస్య గురించి వారు కూడా వివరించారు.
పార్కిన్సన్ ను ఎవరు కనిపెట్టారు?
1817లో తొలిసారి తన వ్యాసంలో షేకింగ్ పాల్సీ అనే సమస్య గురించి జేమ్స్ పార్కిన్సన్ రాయడంతో అప్పట్నుంచి దీనిపేరు పార్కిన్సన్స్ డిసీజ్ అని వచ్చింది. న్యూరో సమస్యలలో వైకల్యానికి, మరణాలకు కారణమవుతున్న
వాటిలో ఇదొకటి. 40 ఏళ్లు దాటిన వారిలో ప్రతి లక్షమంది ప్రజల్లో 94 మందికి ఇది ఉంటోందన్నారు. భారతదేశంలో సుమారు 70 లక్షల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు తాజా పరిశోధనలో తేలింది.
ముప్పు కారకాలు…
ఐదు పదుల వయసు దగ్గరపడేకొద్దీ దీని లక్షణాలు కనిపిస్తుంటాయి. మహిళల కంటే పురుషులకే ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ. ఈ నిష్పత్తి 1:1.4గా ఉంది. త్వరగా మెనోపాజ్ రావడం, ఈస్ట్రోజన్ తగ్గడం వల్ల మహిళల్లో ఈ సమస్య కనిపిస్తోంది. కుటుంబంలో సన్నిహితులకు ఉంటే తర్వాతి తరంలోవారికి వచ్చే ప్రమాదం మూడురెట్లు ఎక్కువ అవుతుంది. పురుగుమందులు, వాయు కాలుష్యం, ముఖ్యంగా నైట్రోజన్ డయాక్సైడ్, అతిసూక్ష్మ ధూళికణాల వల్ల కూడా ఇది వస్తుంది. డెయిరీ ఉత్పత్తులు ఎక్కువగా తీసుకోవడం, కాపర్, మాంగనీస్ లేదా లెడ్ ఎక్కువగా విడుదలయ్యే ప్రాంతాల్లో ఉండటం, వ్యవసాయ పనులు, బావి నీరు తాగడం, ఐరన్, మాంగనీస్ ఎక్కువగా తీసుకోవడం, డి-విటమిన్ తగ్గడం కూడా ముప్పు కారకాలే.
శారీరక కారణాలు …
జీవనశైలి సమస్యలు కూడా పార్కిన్సన్స్ డిసీజ్‌కు కొంత కారణమవుతున్నాయి. ఊబకాయం, టైప్-2 మధుమేహం, మెదడుకు గాయం కావడం, మెలనోమా లేదా ప్రోస్టేట్ కేన్సర్ రావడం లాంటివి ఇందుకు కారణాలు.
గుర్తించడం ఎలా
ఇందులో ప్రధానంగా మూడు లక్షణాలుంటాయి. అవి.. వణుకు, నడక నెమ్మదించడం, గట్టిగా అయిపోవడం. మొత్తం రోగుల్లో 70-80% మందికి వణుకు ఉంటుంది. మొదట్లో ఇది ఇతరులు గుర్తించేంతగా ఉండదు గానీ, ఎవరికి వారికే తెలుస్తుంది. వ్యాధి తీవ్రమయ్యేకొద్దీ ఇతరులకూ అది కనిపిస్తుంది. మొదట్లో చేతుల్లో వణుకు మొదలై, క్రమంగా కాళ్లు, పెదవులు, దవడ, నాలుక, అరుదుగా తల కూడా వణుకుతాయి. ముఖంలో భావాలు పలికించలేరు. కళ్లు ఆర్పడం తగ్గుతుంది. మాట సరిగా రాదు. స్పష్టంగా, గట్టిగా మాట్లాడలేరు. సరిగా నమలలేరు. నోట్లోంచి చొంగ కారుతూ ఉంటుంది. చేతిరాత సరిగా రాదు. ఉన్నట్టుండి చేతులు, కాళ్లు కదులుతాయి. శరీరం మొత్తం ఒకవైపు వంగిపోయినట్లు ఉంటుంది. గూని వచ్చినట్లు ఉంటారు. మంచం మీద ఒకవైపు నుంచి మరోవైపు తిరగలేరు. కొంత మతిమరుపు వస్తుంది. ఆందోళన, కుంగుబాటు ఉంటాయి. నిద్రసరిగా పట్టదు.
చికిత్స పద్ధతులు
చాలావరకు దీని లక్షణాలకు మాత్రమే చికిత్స చేస్తారు తప్ప వ్యాధికి చికిత్స దాదాపుగా లేదు. లెవోడోపా అనే మందును ఎక్కువగా వాడుతున్నారు. దాంతోపాటు డోపమైన్ అగోనిస్టులు, మోనోమైన్ ఆక్సిడేస్ టైప్ బి లాంటివి కూడా లక్షణాలను బట్టి సూచిస్తారు. అయితే ఇవన్నీ కూడా లక్షణాలను తగ్గించేవే తప్ప వ్యాధిని నయం చేసేవి కావు.అన్నారు.
డాక్టర్. మానస్ పాణిగ్రాహి మాట్లాడుతూ. పార్కిన్సన్స్ డిసీజ్ లక్షణాలను బాగా తగ్గించగలిగే చికిత్సలలో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ శస్త్రచికిత్స ఒకటి ప్రాచుర్యం పొందింది. శరీర కదలికలను సాధారణ స్థితికి తీసుకొచ్చేలా మెదడు లోపలి భాగాలను ప్రేరేపితం చేయడమే ఈ శస్త్రచికిత్స ప్రధాన ఉద్దేశం. రోగి పరిస్థితిని, వయసును బట్టి దీన్ని నిర్ణయిస్తారు. మందుల కంటే దీనివల్ల కొంత ఎక్కువ ఫలితం ఉంటుందని పరిశోధనల్లో తేల్చారు.

