దక్షిణ మధ్య రైల్వేలోని వివిధ డివిజన్ లలోని సిబ్బంది తమ విధి నిర్వహణలో చురుకుదనం మరియు అంకితభావాన్ని ప్రదర్శించినందుకుగాను 08 మంది ఉద్యోగులకు “ఎంప్లాయ్ ఆఫ్ ది మంత్” భద్రతా అవార్డులను సికింద్రాబాద్‌లోని రైలు నిలయంలో సోమవారం జరిగిన భద్రతా సమీక్షా సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ అందజేశారు.
ఈ సమీక్షా సమావేశంలో దక్షిణ మధ్య రైల్వేకు చెందిన వివిధ శాఖలకు చెందిన ప్రధానాధిపతులు , ఆరు డివిజన్లు సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంతకల్, గుంటూరు, నాందేడ్‌కు చెందిన డివిజనల్ రైల్వే మేనేజర్లు (డీఆర్ఎంలు) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.
శ్రీ అరుణ్ కుమార్ జైన్ జోన్ పరిధిలోని వివిధ డివిజన్ లకు చెందిన 08మంది ఉద్యోగులకు విధి నిర్వహణలో అప్రమత్తతను ప్రదర్శించినందుకు మరియు అసురక్షిత పరిస్థితులను నివారించడానికి సకాలంలో చర్యలు చేపట్టినందుకు : సికింద్రాబాద్ డివిజన్ నుండి 01 ,విజయవాడ డివిజన్ -01, గుంతకల్ డివిజన్ – 05 మరియు నాందేడ్ డివిజన్ -01 “ఎంప్లాయ్ ఆఫ్ ద మంత్” భద్రతా అవార్డులను అందజేశారు. ఈ సందర్బంగా జనరల్ మేనేజర్ అవార్డు గ్రహీతల విధుల నిర్వహణలో వారి చిత్తశుద్ధి మరియు నిబద్ధతను అభినందించారు. ఈ అవార్డులు భద్రతా విధానాలను అనుసరించడంలో ఇతర ఉద్యోగులను ప్రేరేపిస్తాయని, అలాగే రైళ్లను సురక్షితంగా నడిపేందుకు రైల్వేలకు కుడా ఎంతో సహాయపడతాయని ఆయన పేర్కొన్నారు
శ్రీ అరుణ్ కుమార్ జైన్ జోన్ లో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా తీసుకోవాల్సిన భద్రతా జాగ్రత్తలపై సమీక్షించారు. రైల్వే ట్రాక్ పై ఇరవై నాలుగు గంటల పాటు గస్తీ నిర్వహించడం పటిష్టం చేయాలని మరియు ట్రాక్‌కి సమీపంలో ఉన్న వంతెనలు, ఆర్.ఓ.బి/ఆర్ యూ బి లు మరియు నీటి కుంటల వద్ద శ్రద్ధ వహించాలని ఆయన అధికారులను ఆదేశించారు. రైల్వే వంతెనల వద్ద నీటి ప్రవాహ స్థాయినీ పర్యవేక్షించాలని, ముఖ్యంగా గుర్తించిన ప్రమాద ప్రదేశాలలో ల్యాండ్ స్లైడింగ్పై నిఘా ఉంచాలని ఆయన ఆదేశించారు. వర్షాకాలం దృష్ట్యా జోన్ లో నెల రోజుల పాటు ప్రత్యేక సేఫ్టీ డ్రైవ్‌లు నిర్వహించాలని అధికారులందరినీ ఆదేశించారు.
జనరల్ మేనేజర్ రైలు కార్యకలాపాల భద్రతను సమీక్షిస్తూ రైళ్లను సురక్షితంగా నడిపేందుకు భద్రతా విధానాలను ఖచ్చితంగా పాటించాలని అధికారులను ఆదేశించారు మరియు సత్వర పద్ధతులను అవలంబించ కూడదని ముఖ్యంగా రన్నింగ్ సిబ్బంది వాటికి దూరంగా ఉండాలని ఆదేశించారు. సమయపాలనను మెరుగుపరచడానికి సాధ్యమైన మేరకు వేగ పరిమితులను ఎత్తివేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
అరుణ్ కుమార్ జైన్ ప్రయాణికుల సౌకర్యాలపై చర్చించారు. వివిధ స్టేషన్లలో అందుబాటులో ఉన్న నీటి ట్యాంకుల స్థితిగతులను ఆయన సమీక్షించారు. ఎక్కడికక్కడ వినియోగంలో లేని పాత నీటి ట్యాంకులను మార్చాలని అధికారులను ఆదేశించారు. జోన్లో పాదాచారుల వంతెల మరమ్మతుల పురోగతిపై కూడా ఆయన సమీక్షించారు మరియు ఎఫ్ఓబిలపై ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి నిర్ణీత సమయంలో వాటి మరమత్తులు పూర్తి చేయాలని ఆదేశించారు. జోన్ లో పొగను గుర్తించే పరికరాలను, అగ్నిమాపక యంత్రాల నిల్వలను పరిశీలించిన ఆయన, భద్రతకు సంబందించిన అన్ని అగ్నిమాపక పరికరాల సరిపడా నిల్వలు ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
సిబ్బంది పని వేళలపై కూడా ఆయన చర్చించారు మరియు సిబ్బందికి సరైన విశ్రాంతి ఇవ్వడానికి ఖచ్చితమైన ప్రణాళిక చేయాలని డివిజనల్ రైల్వే మేనేజర్లందరికీ సూచించారు.


