మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం తో పాటు వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై వుందని జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాల క్రిష్ణ పేర్కొన్నారు.
శుక్రవారం ఉదయం ఒంగోలు లోని కేంద్రీయ విద్యాలయంలో జరిగిన వన మహోత్సవ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాల క్రిష్ణ ముఖ్య అతిధిగా పాల్గొని మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడంతో పాటు వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పారిశ్రామికీకరణ నేపధ్యంలో మరియు రోజు రోజు కు పెరుగుతున్న జనాభా, ఉష్ణోగ్రతలను దృష్టిలో వుంచుకొని పర్యావరణం సమతౌల్యాన్ని కాపాడడానికి మొక్కలను విరివిగా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్ధి దశ నుండే విద్యతో పాటు మొక్కల పెంపకం యొక్క ఆవశ్యకతను తెలుసుకొని మొక్కలు నాటే కార్యక్రమాల్లో విద్యార్ధులు బాగస్వాములు కావాలన్నారు. ప్రతీ ఒక్క విద్యార్థి ఒక మొక్కను నాటి ప్రతి రోజు కొంత సమయాన్ని కేటాయించి వాటి సంరక్షణకు వారే బాధ్యత తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఈ సందర్భంగా విద్యార్థులకు సూచించారు. ఈ నెల 29వ తేదీన నోబెల్ బహుమతి గ్రహీత, బాలల హక్కుల కార్యకర్త కైలాష్ సత్యార్థి కలెక్టరేట్ ఆవరణలో మొక్కలు నాటిన విషయాన్ని గుర్తు చేసారు. హరితాంధ్ర కోసం అడుగేద్దాం ప్రతి ఒక్కరం మొక్కలు నాటుదాం అనే నినాదంతో ప్రతి ఒకరు హరిత యజ్ఞంలో పాలు పంచుకోవాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్ధులచే ప్రతిజ్ఞ చేయించారు.
కార్యక్రమంలో డిఎఫ్ఓ సోషల్ ఫారెస్ట్రీ సునీత, ఆర్డిఓ సుబ్బారెడ్డి, కనిగిరి అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శ్రీనివాస రావు, కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్ అబ్దుల్ అఫీజ్, 19వ డివిజన్ కార్పొరేటర్ వెంకటేశ్వర రావు, రిటైర్డ్ ప్రిన్సిపాల్ సూర్యప్రకాష్ రావు తదితరులు మాట్లాడుతూ… నేటి పరిస్థితుల్లో మొక్కల పెంపకం యొక్క ఆవశ్యకతను వివరించారు.
ఈ సందర్భంగా మొక్కల పెంపకం ఆవశ్యకత పై నిర్వహించిన డ్రాయింగ్ మరియు వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్ధులకు జాయింట్ కలెక్టర్ మెమెంటోలను ప్రదానం చేసారు.
కార్యక్రమంలో ఆటవీ శాఖ సిబ్బంది, కేంద్రీయ విద్యాలయం విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.
