భారీ వర్షాలతో గతంలో ఎన్నడూ లేనంతగా విజయవాడ నగరాన్ని వరదనీరు ముంచెత్తిన నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిద్రాహారాలు మాని కష్టపడి పనిచేస్తున్న తీరు నాయకులు, కార్యకర్తలలో స్ఫూర్తి నింపుతుందని *ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షులు, మాజీ జెడ్పీ చైర్మన్ డా.నూకసాని బాలాజీ* ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
అర్ధరాత్రి సమయంలోనూ చంద్రబాబు వరద ప్రాంతాల్లో పర్యటించి అధికారులను పరుగులు పెట్టిస్తున్నారని, ప్రజలకు సహాయ, సహకారాలు అందిస్తున్నారని, వరదనీరు పూర్తిగా తగ్గేవరకు విజయవాడ నుంచి కదలనని చెప్పడం ప్రజల్లో ధైర్యాన్ని నింపిందని తెలిపారు. 70 ఏళ్లు పైబడిన వయస్సులోనూ చంద్రబాబు ప్రజల కోసం అలుపెరగకుండా రాత్రింబవళ్ల్లు పనిచేయడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందన్నారు.
వైసీపీ హయాంలో వరదలు వచ్చినప్పుడు జగన్ తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకు వచ్చిన పాపాన పోలేదని, ప్రజలను మీ చావు మీరు చావండి అంటూ గాలికి వదిలేశాడని విమర్శించారు. ఇప్పుడు కూడా ప్రజలకు అండగా ఉండాల్సిన సమయంలో జగన్ చెత్త రాజకీయాలు చేస్తున్నాడని దుయ్యబట్టారు. వర్షాలకు అమరావతి మునిగిపోయిందంటూ కుట్రలకు తెరలేపడాన్ని చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని మండిపడ్డారు.
ప్రజలు వరద నీటిలో చిక్కుకుని ఆకలితో అలమటిస్తుంటే చంద్రబాబు బోట్లో స్వయంగా వెళ్లి భోజనం ప్యాకెట్లు అందించారని తెలిపారు. లక్షన్నర మందికి భోజనం తయారుచేయించి ప్రజల ఆకలి తీరుస్తున్నారన్నారు. ఊహించని వరద విజయవాడ ప్రజలను అతలాకుతలం చేసిందని, ఈ సమయంలో అండగా ఉండాలనే ఉద్ధేశంతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు భోజనం ప్యాకెట్లు పంపిణీ చేయడంతో పాటు వారి అవసరాలు తీర్చేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.
జిల్లా నుంచి కూడా భోజనం తయారు చేయించి విజయవాడకు తీసుకెళ్లారన్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఎక్కడున్నారని ప్రశ్నించారు. అమరావతి ప్రాంతంలో వరద నీరు నిల్వ లేకుండా చేసేందుకు చంద్రబాబు ముందుచూపుతో కొండవీటి వాగుపై లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిర్మించారని గుర్తు చేశారు. ఎంత వరద వచ్చినా ఆ నీటిని మోటార్ల ద్వారా కృష్ణానదిలోకి పంప్ చేయవచ్చునన్నారు. అందువల్లే ఇప్పుడు అమరావతిలో చుక్కనీరు కూడా నిల్వ లేదనే విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్న సమయంలో రాజకీయాలు చేయ డం మంచి పద్దతి కాదని జగన్కు హితవు పలికారు.
