ఒంగోలు నగర శివారులోని కొప్పోలు రోడ్డులో ఉన్న నక్కల రాణిమ్మ కాలనీని కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా గురువారం సందర్శించారు. ఇటీవల జిల్లాలో జాతీయ ఎస్.టి. కమిషన్ సభ్యులు జాతోట్ హుస్సేన్ పర్యటించిన సందర్భంగా తమ ఇళ్ల సమస్యను పరిష్కరించాలని స్థానిక గిరిజనులు ఆయనను కోరారు. ఈ నేపధ్యంలో కలెక్టర్ కాలనీని సందర్శించారు. గతంలో స్థానికంగా గిరిజనులు నివసించే వారని, కొన్నేళ్ల క్రితం భారీ వర్షాల నేపధ్యంలో పక్కనే ఉన్న నల్లవాగు పొంగడంతో వీరి ఇళ్లలోని నీళ్లు చేరాయని అధికారులు కలెక్టర్ కు తెలిపారు. అప్పటి నుంచి ఆ కాలనీని వారు ఖాళీ చేసినట్లు వివరించారు దీనిపై అధికారులు మాట్లాడుతూ …ఈ కాలనీని మెరక చేయడంతో పాటు వరద నీరు రాకుండా చుట్టూ రిటైనింగ్ వాల్ నిర్మించవచ్చని చెప్పారు. మెరక చేయడానికి సుమారు రూ.40 లక్షలు, రిటైనింగ్ వాల్ నిర్మాణానికి సుమారు రూ.1.4 కోట్లు అవుతుందని అంచనా వేశామన్నారు. ఇంత ఖర్చు చేసే బదులు ప్రత్యామ్నాయ లే అవుట్లో ఇళ్ల స్థలాలు కేటాయించే విషయాన్ని కూడా పరిశీలించవచ్చని అధికారులు చెప్పారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ సమీక్షించి నిర్ణయం తీసుకుందామని తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె వెంట ఆర్.డి.ఓ. సుబ్బారెడ్డి, హౌసింగ్ పి.డి. పి.ప్రసాద్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి జగన్నాధరావు, మున్సిపల్ కమిషనర్ కె. వెంకటేశ్వరరావు, ఒంగోలు తహశీల్దార్ వాసు, కొత్తపట్నం తహశీల్దార్ మధుసూదన్, ఇతర అధికారులు ఉన్నారు.


