భూగర్భ జలాల రీఛార్జ్ కి తగిన చర్యలు తీసుకోవాలి -జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్

భూగర్భజలాలను అధికంగా వినియోగించిన గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టి తిరిగి నీటిమట్టం పెరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా చెప్పారు. ఇందులో భాగంగా మార్కాపురం మండలంలోని నికరంపల్లిని మోడల్ గ్రామంగా ఎంపిక చేశామన్నారు. ఈ గ్రామంలో భూగర్భ నీటిమట్టం పెంచడానికి తీసుకోవలసిన చర్యలపై శుక్రవారం ప్రకాశం భవనంలోని తన ఛాంబర్ లో సంబంధిత అధికారులతో ఆమె ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

జిల్లాలో మొత్తం 57 గ్రామాలలో పరిమితికి మించి భూగర్భజలాలను వినియోగించినట్లు గుర్తించామని భూగర్భజలవనరుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ విద్యాసాగర్ సందర్భంగా కలెక్టర్ కు తెలిపారు. వీటిలో 14 గ్రామాల్లో రిలయన్స్ ఫౌండేషన్, సార్డ్స్, ఎఫర్డ్ సంస్థలు ఇప్పటికే అధ్యయనం చేసి వాటర్ బడ్జెట్ ప్రణాళికను రూపొందించాయని ఆయన చెప్పారు. ఈ జాబితాను పరిశీలించిన కలెక్టర్ నికరంపల్లిని మోడల్ గ్రామంగా ఎంపికచేసి భూగర్భ నీటిమట్టం పెరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ దిశగా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ శానిర్దేశం చేశారు.

కేవలం భూగర్భ నీటిమట్టం పెంచడానికే పరిమితం కాకుండా స్థానిక నీటి వనరులను బట్టి సాగుచేయాల్సిన పంటలపై రైతులకు అవగాహన కూడా కల్పించాలని కలెక్టర్ చెప్పారు. అదేవిధంగా వ్యవసాయం పైనే కాకుండా దాని అనుబంధ రంగాలలోనూ జీవనోపాధి పెరిగేలా ప్రణాళిక రూపొందించాలని ఆమె ఆదేశించారు. జిల్లాలో భూగర్భ నీటి మట్టం పెంచేందుకు చేపడుతున్న ఈ కార్యక్రమాలు ఉద్యమ రీతిలో ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా ప్రజలకు అవగాహన కల్పించి వారిని భాగస్వాములను చేయాలని చెప్పారు. ఇందులో భాగంగా ఈ నెల 23వ తేదీన నికరంపల్లిలో గ్రామసభ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని ఆమె చెప్పారు .

ఈ సమావేశంలో డ్వామా పి.డి. జోసఫ్ కుమార్, ఏ.పి.ఎం.ఐ.పి. పి.డి. పి.వి.రమణ, జడ్.పి. సి.ఈ.ఓ చిరంజీవి, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, జిల్లా ఉద్యాన అధికారి గోపీచంద్, ఆర్.డబ్ల్యు.ఎస్. ఎస్.ఈ. (ఇన్ఛార్జి) డి. వెంకటరమణ, ఇరిగేషన్ అధికారులు, రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధులు వెంకట బాబూరావు, నవీన్, సార్డ్స్ ప్రతినిధి సునీల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *