స్వీకారం కార్యక్రమం కింద సంక్షేమ వసతి గృహాల్లో కనీస మౌలిక వసతులు కల్పించేందుకు చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేయడంతో పాటు చేపట్టవలసిన పనులను త్వరగా మొదలుపెట్టేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా, అధికారులను ఆదేశించారు.
శుక్రవారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, అధికారులతో సమావేశమై స్వీకారం కార్యక్రమం కింద సంక్షేమ వసతి గృహాల్లో కనీస మౌలిక వసతులు కల్పించేందుకు చేపట్టిన పనుల పురోగతిపై సమీక్షించి పలు సూచనలు, ఆదేశాలు ఇవ్వడం జరిగింది. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… స్వీకారం కార్యక్రమంలో భాగంగా సామాజిక భాద్యతతో ముందుకు వచ్చి సంక్షేమ వసతి గృహాల్లో కనీస మౌలిక వసతులు కల్పించేందుకు సాంఘీక సంక్షేమ హాస్టళ్లను దత్తత తీసుకున్న సంబంధిత కార్పొరేట్ సంస్థల ప్రతినిధులను సమన్వయం చేసుకొని త్వరగా పనులు మొదలు పెట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏ సంక్షేమ వసతి గృహాన్ని ఏ కార్పోరేట్ సంస్థ దత్తతు తీసుకున్నది, సంబంధిత వసతి గృహంలో ఏఏ పనులు చేపట్టాలి, వాటికి సంబంధించిన ప్రతిపాదనలు తయారు చేయడం తదితర విషయాలను రోజువారీగా మానిటరింగ్ చేయుటకు నోడల్ అధికారిని నియమించాలని జిల్లా కలెక్టర్, సోషల్ వెల్ఫేర్ డిడి ను ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులు ఈ పనుల పురోగతి పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో సోషల్ వెల్ఫేర్ డిడి లక్ష్మా నాయక్, సీపీఓ వేంకటేశ్వర రావు, మత్స్య శాఖ జేడి చంద్రశేఖర్, పరిశ్రమల శాఖ జిఎం శ్రీనివాస రావు, బిసి వెల్ఫేర్ అధికారి అంజల, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జగన్నాథ రావు, మైనింగ్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు .
