ప్రజా సమస్యల పరిష్కార వేదిక ( పీజీఆర్ఎస్ ) లో వచ్చిన అర్జీలపై జిల్లా అధికారులు తక్షణమే స్పందించి, సకాలంలో నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా, జిల్లా అధికారులను ఆదేశించారు.
సోమవారం ఒంగోలు కలెక్టరేట్ లోని మీ కోసం సమావేశ మందిరంలో నిర్వహించిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాల క్రిష్ణ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు లోకేశ్వర రావు, వర కుమార్ల తో కలసి పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ, జిల్లా లోని సుదూర ప్రాంతాల నుండి తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ఎంతో ఆశతో అర్జీదారులు వస్తారని, వచ్చిన సమస్యలను అర్జీదారుడు సంతృప్తిచెందేలా సమస్యలను నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్ధితుల్లోను బియాండ్ ఎస్ఎల్ఎ లేకుండా నిర్ణీత గడువు లోపు అర్జీల పరిష్కార తీరు ఉండాలన్నారు. అర్జీదారుల సమస్యలను పరిష్కరించడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి అర్జీ దారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు పరిష్కరించాలన్నారు. అర్జీలు పెండింగ్, రీ ఓపెనింగ్ లేకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీల పరిష్కార తీరు ఉండాలన్నారు. జిల్లా అధికారులు వారి సిబ్బంది ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం ప్రదర్శిస్తే ఉపేక్షించబోనని హెచ్చరించారు. ప్రజా సమస్యలపై సత్వరమే స్పందించి క్షేత్రస్థాయిలో అర్జీదారులు ఎదుర్కొంటున్న అంశాలపై ప్రత్యేక దృష్టిని సారించి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఈరోజు నిర్వహించిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంలో 269 వినతులు వచ్చాయి.
ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలపై జిల్లా గ్రంధాలయ సంస్థ ప్రచురించిన వాల్ పోస్టర్స్ ను మరియు క్యాన్సర్ నివారణకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై వైద్య ఆరోగ్య శాఖ ప్రచురించిన వాల్ పోస్టర్స్ ను జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, సంబంధిత అధికారులతో కలిసి ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో బి. చిరంజీవి, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పిడి వసుంధర, డ్వామా పిడి జోసఫ్ కుమార్, ఐసిడిఎస్ పిడి మాధురి, డిపిఓ వెంకట నాయుడు, డిఎం అండ్ హెచ్ఓ డా. సురేష్ కుమార్, పశుసంవర్ధక శాఖ జెడి డా. బేబి రాణి, సిపిఓ శ్రీ వేంకటేశ్వర రావు, జిల్లా రిజిస్ట్రార్ శ్రీ బాలాంజనేయులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.



