వినియోగదారులు తమ హక్కులను తెలుసుకుని ఉపయోగించుకోవాలని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో మంగళ వారం జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ అధ్యక్షతన నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వినియోగదారులే అని వారి చట్టాలపై అవగాహన కల్పించి క్షేత్ర స్థాయిలో చైతన్యం కలిగించటానికి పలు కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. వినియోగదారుల న్యాయ పాలనకు వర్చువల్ విచారణ మరియు డిజిటల్ సౌలభ్యం పై చర్చించారు. వినియోగదారులు ఏ వస్తువునైనా కొనుగోలు చేసే సమయంలో వాటి లైసెన్స్, ఎక్ఫై రీ తేదీ, కస్టమర్ కేర్ నంబర్, మెయిల్ ఐడీ, ఎం ఆర్పీ ధర కన్నా ఎక్కువగా అమ్ముతున్నారో అని ఒక సారి పరిశీలించుకోవాలని వక్తలు కోరారు. ప్రస్తుతం వినియోగదారులు ఏ విధంగా నష్టపోతున్నారో వివరించారు. అనంతరం మేలు కొలుపు పుస్తకాన్ని ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్లు ఆవిష్కరించారు. జిల్లాలోని ప్రధాన శాఖల అధికారులు పాల్గొన్నారు.

