పొదిలి సర్కిల్ పరిధిలో లా & ఆర్డర్ కాపాడుట, నేరాలు & ట్రాఫిక్ నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాలపై నిఘా, విపత్తు నిర్వహణ మరియు ఇతర పోలీసింగ్ అవసరాల కొరకు కొనకనమిట్ల మండలం, బచ్చలకూరపాడు గ్రామానికి చెందిన కాసు వెంకటేశ్వర రెడ్డి (ఎన్ఆర్ఐ) అనే వ్యక్తి గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ కి అత్యాధునిక సాంకేతికత కూడిన ఒక డ్రోన్ ను అందచేసినారు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని స్మార్ట్ పోలీసింగ్ విధానంతో ముందుకు సాగుతున్న ప్రకాశం జిల్లా పోలీస్ శాఖకు సామాజిక బాధ్యత, సేవా స్పూర్తితో ఒక ఎన్ఆర్ఐ వ్యక్తి తన స్వదేశానికి సేవ చేసే ఉద్దేశంతో పోలీస్ శాఖకు ఒక డ్రోన్ ను స్పాన్సర్ చేయడం అభినందనీయమని జిల్లా ఎస్పీ పోలీస్ శాఖ తరుపున వారికి కృతజ్ఞతలు తెలిపారు.
జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ…. ఈ డ్రోన్స్ ద్వారా లా & ఆర్డర్, నేర నియంత్రణ, రద్దీగా ఉండే జంక్షన్లు పర్యవేక్షించడం ద్వారా ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడకుండా ట్రాఫిక్ నిర్వహణకు, దొంగల్ని గుర్తించడం, పారిపోతున్న వారిని ఛేజ్ చేయడం, పలు బందోబస్తులు, బహిరంగ సభలు, జాతరలు/ఊరేగింపు సమయంలో జన సమూహాన్ని పర్యవేక్షించడం ద్వారా క్రౌడ్ మేనేజ్మెంట్ ద్వారా అవాంఛనీయ సంఘటనలు నిలువరించుట, అమ్మాయిలను ఈవ్ టీజ్ చేయడం, ఒంటరిగా వెళ్లే మహిళలు కావచ్చు లేదా వ్యక్తులునైనా బెదిరించడం, చైన్ స్నాచింగ్, చోరీలు వంటి నేరాలకు పాల్పడే వారికి డ్రోన్లతో చెక్ పెట్టవచ్చన్నారు. హైవేలపై బైక్ రేసులు అరికట్టుట, డ్రగ్స్ విక్రయం/సేవించడం, మారుమూల ప్రాంతాల్లో నాటుసారా తయారీ, పేకాట స్థావరాలు, శివార్లలో ఓపెన్ డ్రింకింగ్ చేసి న్యూసెన్స్ క్రియేట్ చేయడం… వంటి చట్టవ్యతిరేక/అసాంఘిక కార్యకలాపాలపై నిఘా ఉంచి వాటిని నియంత్రించడంలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. డ్రోన్లతో కవర్ చేసిన విజువల్స్ సేవ్ చేస్తాయని తెలిపారు.
కొన్ని సందర్భాలలో పోలీసులు భౌతికంగా వెళ్లలేని ప్రదేశాలకు డ్రోన్లను పంపి అక్కడి పరిస్థితులను సమీక్షించుకునే వీలుంటుందన్నారు. ప్రస్తుతం 12 డ్రోన్లు ఎగురవేస్తున్నామని, త్వరలోనే జిల్లాలోని అన్ని పోలీస్ స్టేష్లన్ల పరిధిలో డ్రోన్లు ఎగురవేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కార్యక్రమంలో దర్శి డిఎస్పీ లక్ష్మీనారాయణ, పొదిలి సిఐ టి.వెంకటేశ్వర్లు, కె.కె.మిట్ల ఎస్సై రాజ్ కుమార్, తర్లుపాడు ఎస్సై బ్రహ్మనాయుడు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

