స్వాతంత్యం కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం అలుపెరగని సమరం సాగించిన రాజకీయ, సామాజిక విప్లవ యోధుడు బాబూ జగ్జీవన్ రామ్ అని, విలువలతో కూడిన ఆయన జీవితం మన అందరికీ ఆదర్శనీయమని.. ఆయన అడుగు జాడల్లో నేటి యువత నడవాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా పేర్కొన్నారు.
శనివారం ఒంగోలు లోని అంబేద్కర్ భవనంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డా. బాబూ జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…. డా.బాబూ జగ్జీవన్ రామ్ చిన్నతనంలోనే కుల వివక్షతను ఎదుర్కొని సమాజ అభ్యున్నతి కోసం కృషి చేసారన్నారు. ఆయన జీవితాన్ని సామాజిక న్యాయం, రైతుల సంక్షేమం మరియు దేశ అబివృద్దికి అంకితం చేసారన్నారు. అతి చిన్న వయస్సు లోనే శాసన సభ్యులుగా ఎన్నిక కావడం జరిగిందని, 8 సార్లు పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారని జిల్లా కలెక్టర్ తెలిపారు. మరణించే వరకు దేశ సేవకు, సమాజ అభ్యున్నతి కోసం కృషి చేసారు. స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని ఎన్నో ఏళ్ల పాటు జైలు జీవితం గడిపారన్నారు. 1935లో అంటరాని వారికి సమానత్వం కోసం అంకితమైన ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ అనే సంస్థను స్థాపించి దళితుల హక్కుల కోసం పోరాడారు. సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషి ఎప్పటికీ మర్చిపోలేమన్నారు. అతి పిన్న వయస్సు లోనే భారతదేశపు మొట్టమొదటి క్యాబినెట్ కార్మిక శాఖా మంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగిందన్నారు. కేంద్ర వ్యవసాయ మంత్రిగా ఆ శాఖ ను సమర్ధవంతగా ముందుకు నడిపి దేశానికి ఆహార భద్రత కల్పించారు. 1971 ఇండో పాక్ యుద్ద సమయంలో భారత రక్షణ మంత్రిగా కీలక పాత్ర పోషించారు. షెడ్యుల్ కులాల అభ్యున్నతికి దళితుల హక్కులను రాజ్యాంగంలో డా బి ఆర్ అంబేడ్కర్ పొందుపరిస్తే వాటిని చట్ట రూపంలో అమలు చేయడానికి జగ్జీవన్ రామ్ చేసిన కృషి ఎప్పటికీ మరిచిపోలేమన్నారు. జిల్లా లో సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలకు అవసరమైన మరమ్మతులు చేయడం జరుగుచున్నదన్నారు. అలాగే సంక్షేమ వసతి గృహాల్లో చదువుచున్న విద్యార్ధులకు ముఖ్యమంగా బాలికల విద్యపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.
సంతనూతల పాడు శాసన సభ్యులు బి ఎన్ విజయ కుమార్ మాట్లాడుతూ… చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి సుదీర్ఘకాలం పాటు పార్లమెంట్లో వివిధ మంత్రిత్వ శాఖలో సేవలందించారన్నారు. జాతీయ భద్రత, ఆహార భద్రత నెలకొల్పడంలో ఆయన పాత్ర వెలకట్టలేనిదన్నారు. పట్టుదల, ఆశయ సాధనకు నిలువెత్తు నిదర్శనం.. డా. బాబు జగ్జీవన్ రామ్ అని అభివర్ణించారు. స్వతంత్ర సమర యోధుడిగా ఆయన చేసిన పోరాటం, రాజ్యాంగ అమలులో బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి చేసిన సేవలు ఆదర్శనీయమని ఆయన తెలిపారు.
జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ మాట్లాడుతూ… డా. బాబూ జగ్జీవన్ రామ్ గారి స్పూర్తితో జిల్లా యంత్రాంగం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేస్తుందన్నారు. డా. బాబూ జగ్జీవన్ రామ్ గారు మహోన్నతమైన వ్యక్తి, స్వయం కృషితో ఎదిగిన వ్యక్తి అని, ఆయన ఏ పదవి చేపట్టినా సమర్ధవంతంగా నిర్వర్తించి అందరి మన్ననలు పోదారన్నారు. బాబు జగ్జీవన్ రామ్ గారి ఆశయ స్ఫూర్తితో ఆయన అడుగుజాడల్లో నడుస్తూ సమసమాజ స్థాపనకు ఆయన కన్నకలలను సాకారం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.
జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు మాట్లాడుతూ, భారత ఉపప్రధాని స్థాయికి ఎదిగారంటే.. ఆయన అకుంఠిత దీక్ష, పట్టుదల, క్రమశిక్షణకు నిదర్శనం అని చెప్పవచ్చన్నారు. బాబు జగ్జీవన్ రామ్ బడుగు బలహీన వర్గాలకు ఎంతో మేలుచేసారన్నారు. బాబు జగజ్జీవన్ రావ్ సేవలను మనం గుర్తు చేసుకుంటూ ఆయన ఆశయాలకు అనుగుణంగా అందరూ పనిచేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం.. జిల్లా కలెక్టర్, ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ సంఘాల నేతలతో కలసి డా.బాబూ జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం జిల్లాకు చెందిన పలువురు దళిత సంఘాల నేతలు.. బాబు జగ్జీవన్ రామ్ సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, సాంఘిక సంక్షేమ శాఖ డిడి లక్ష్మా నాయక్, జిల్లా అధికారులు, జిల్లాకు చెందిన పలువురు దళిత సంఘాల నేతలు, విద్యార్ధులు, ప్రజలు పాల్గొన్నారు.






