అమరావతిలో జరగబోయే కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోతుంది,” అని
ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ డా. నూకసాని బాలాజీ అన్నారు.
తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2014లో సీఎం నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి, విశ్వమానవ దృష్టితో, అద్భుతమైన రాజధాని నిర్మాణానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. రైతుల నుంచి 34 వేల ఎకరాలు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా స్వచ్ఛందంగా సమకూర్చుకోవడం దేశ చరిత్రలోనే ఒక అపూర్వ ఘట్టమని కొనియాడారు.అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం అభివృద్ధిని, రాజధాని లక్ష్యాలను తుంగలో తొక్కి, మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని భిన్నాభిప్రాయాల అగ్నిగుండంలా మార్చిందని విమర్శించారు. ఆ సమయంలో అభివృద్ధి పూర్తిగా అడ్డంకులకు గురైందన్నారు.
పరిపక్వమైన ప్రజల తీర్పుతో, తెలివైన నిర్ణయంతో ప్రజలు మళ్లీ చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకురావడం ఒక సాహసోపేతమైన అడుగుగా పేర్కొన్నారు. బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమిగా ఏర్పడి సాధించిన 164 సీట్లతో ప్రజలు అభివృద్ధిని కోరుకున్న తీరును ప్రశంసించారు.
ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం అమరావతిలో ప్రారంభించనున్న రూ. 49,000 కోట్ల విలువైన రాజధాని నిర్మాణ కార్యక్రమాలను చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. ఇందులో భాగంగా సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, న్యాయమూర్తుల నివాసాలు, ఎమ్మెల్యే/ఎంఎల్సీల నివాస సముదాయాల వంటి అనేక నిర్మాణాలు ప్రారంభం కానున్నట్లు తెలిపారు.
ఈ మహాప్రయోగానికి రాష్ట్ర నలుమూలల నుండి దాదాపు 5 లక్షలమంది ప్రజలు హాజరవుతారని తెలిపారు. ప్రకాశం జిల్లా నుంచి 8 నియోజకవర్గాల నుంచి 470 వాహనాలలో షుమారు 20,000 మంది పాల్గొంటారని వివరించారు.
బీసీ జనగణనను చేపట్టిన కేంద్ర ప్రభుత్వానికి మరియు దానికి సహకరించిన చంద్రబాబు నాయుడు కి కృతజ్ఞతలు తెలియజేశారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి ఇది మైలురాయి అని పేర్కొన్నారు. టిడిపి అంటే బీసీలు – బీసీలు అంటే తెలుగుదేశం.. అనే భావజాలంతో పార్టీ స్థాపితమైనప్పటి నుండి సాగుతున్న తాత్విక వైఖరికి ఇది నిదర్శనమని వ్యాఖ్యానించారు.
ఇక కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని, కార్మిక సోదరులకు శుభాకాంక్షలు తెలియజేసారూ. శుక్రవారం కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
